జగన్ సర్కారు నిర్వహించిన ఒక రోజు అసెంబ్లీ సమావేశాల్ని విపక్ష టీడీపీ బాయ్ కాట్ చేయటం తెలిసిందే. అలా అని ఊరికే ఉండిపోతే మైలేజీ మిస్ అయ్యే అవకాశం ఉంది కదా? అందుకే.. కరోనా కాలానికి తగ్గట్లుగా.. జగన్ సర్కారుకు తీసిపోని రీతిలో విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో కలిపి సమాంతర అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు.
జూమ్ లో నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీకి పార్టీకి చెందిన డోలా బాలవీరాంజనేయ స్వామిని స్పీకర్ గా నియమించి.. తమ షోను నిర్వహించారు.
బడ్జెట్ సమావేశాల్ని తప్పు పడుతూ.. జగన్ సర్కారు తీరుపై విమర్శల వర్షం కురిపించేందుకు వీలుగా మాక్ అసెంబ్లీని నిర్వహించారు.
అనుకున్నట్లే.. అధికారపక్షంపై అదే పనిగా విమర్శలు సంధించిన తెలుగు తమ్ముళ్లలో.. టీడీఎల్పీ ఉప నేత నిర్మల రామానాయుడు చేసిన ఆరోపణలు.. సంధించిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఉన్నాయని చెప్పాలి. ఆయన ఆరోపణల్ని లైట్ తీసుకుంటే.. సర్కారుకే ఇబ్బంది అన్న రీతిలో ఆయన సంధించిన ప్రశ్నలు ఉండటం గమనార్హం.
వ్యాక్సినేషన్ విషయంలో తాము దూసుకెళుతున్నట్లుగా చెప్పే జగన్ సర్కారుకు భిన్నంగా.. దేశంలో టీకా కార్యక్రమంలో ఏపీ 28వ స్థానంలో ఉన్నట్లుగా చెప్పారు. కేంద్రానికి ఇచ్చే కోటా కాకుండా రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేస్తామని సీరం సంస్థ ఏప్రిల్ 20న పెట్టిందని.. ఆ వెంటనే తమిళనాడు కోటి.. కేరళ 30లక్షల డోసులకు ఆర్డర్లు పెట్టాయన్నారు.
‘‘యూపీ.. మహారాష్ట్రలు గత నెలలోనే వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్లకు పిలిచి ఆర్డర్ ఇచ్చేశాయి. జగన్ ప్రభుత్వం కూడా గ్లోబల్ టెండర్లు పిలవాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించారు. అయితే.. డబ్బులువెంటనే ఇచ్చేది లేదని సవాలక్ష రూల్స్ పెట్టారు.
ఇలా అయితే ఎవరు వ్యాక్సిన్ ఇవ్వటానికి వస్తారు? డబ్బులు కేటాయించకుండా.. ఆర్డర్ పెట్టకుండా ఇప్పుడు ఎవరిస్తారు? వ్యాక్సిన్లు చంద్రబాబు ఇప్పించటం లేదని చేతకాని మాటల్ని మాట్లాడుతున్నారు. మీ సలహాదారుల జీతాలు.. సొంతపత్రికలో ప్రకటనలకు వందల కోట్లు వెచ్చించేవారు.. వ్యాక్సిన్ కు డబ్బు ఇవ్వలేరా?’’ అని సూటిగా ప్రశ్నించారు.
బాబు వ్యాక్సిన్ ఇప్పించాలన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే..ఏపీకి ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు ముందస్తుగా ఆర్డర్లు ఇచ్చేయటం.. డబ్బులు చెల్లించటం లాంటివి చేశారు. మరి.. సీఎం జగన్ ఎందుకు చేయలేకపోతున్నారు?
దానికి అడ్డు పడుతున్న అంశాలేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిర్మల రామానాయుడు చేసిన ఆరోపణల్ని లైట్ తీసుకోవచ్చు. కానీ.. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత అధికార వైసీపీ నేతలకు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కానీ ఉంది.
ఎందుకంటే.. నిమ్మల అడిగిన ప్రశ్నల్లో లాజిక్ తో పాటు.. ప్రభుత్వం వెంటనే స్పందించటంలో జరిగిన పొరపాటు కనిపిస్తోందన్న విమర్శ ఉంది.
దీనికి వెంటనే సమాధానం చెప్పకుంటే.. ఈ ప్రశ్నల పరంపర మరింత పెరిగి.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారనుందన్న మాట వినిపిస్తోంది. మరీ ఆరోపణలపై జగన్ సర్కారు వాదన ఏమిటో?