విపత్తు విరుచుకుపడే వేళలో.. దానికి సంబంధించిన వార్తలు ఇవ్వటం మామూలే. అయితే.. విపత్తు తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా వార్తలు చూపించాలని తపించటం తప్పేం కాదు. అయితే.. ఇంత సీరియస్ విషయాన్ని కామెడీగా మార్చేసే తీరు చూస్తే మాత్రం ఒళ్లు మండక మానదు. బిపోర్ జాయ్ తుపాను తీవ్రరూపం దాల్చిన వేళ.. తుపాను తీవ్రత ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేందుకు వీలుగా రిపబ్లిక్ భారత్ చానల్ యాంకర్ చేసిన అతి ఇప్పుడు వైరల్ గా మారింది.
చానల్ స్టూడియోలో.. బ్యాక్ గ్రౌండ్ స్కీన్ మీద తుపాను తీర ప్రాంతాల్లోనిపరిస్థితుల్ని చూపిస్తే.. తాను పెద్ద గొడుగు పట్టుకొని.. తీవ్రమైన గాలికి ఇబ్బంది పడుతూ వార్తల్ని చెబుతున్నట్లుగా చేసిన వైనం ఎబ్బెట్టుగా మారింది. నిజంగానే.. తుపాను తీవ్రతతో విలవిలలాడే ప్రాంతంలో ఉండి.. అక్కడి విపత్తును కళ్లకు కట్టినట్లుగా చెప్పటాన్ని మెచ్చుకోవచ్చు. సాహసచర్యగా అభివర్ణించొచ్చు.
అందుకు భిన్నంగా.. స్టూడియోలో పెద్ద ఫ్యాన్లను ఏర్పాటు చేసి.. ఆ గాలికి చేతిలో ఉన్న గొడుగు అటు ఇటు తిరిగిపోతుంటే.. దానికి తగ్గట్లుగా యాంకర్ అపాసోపాలు పడుతూ వార్తల్ని విశ్లేషించాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఇదే సమయంలో.. మరో వీడియోలో.. విపత్తు వేళ.. ఇండియా.. పాకిస్థాన్ కు చెందిన టీవీ చానళ్ల యాంకర్లు.. రిపోర్టర్లు ప్రదర్శించే అతి ఒక రేంజ్ లో ఉంటుందని మండిపడుతున్నారు.
పాకిస్థాన్ కు చెందిన రిపోర్టర్ ఒకరు వరద ప్రాంతంలోకి వెళ్లి.. రిపోర్టింగ్ చేస్తూ..అక్కడ నీళ్లు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పే క్రమంలో.. ఒక్కసారిగా నీళ్లలోకి దూకేయటం.. పీకల్లోతు నీళ్లు ఉన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పిన తీరు చూస్తే.. మరీ అంతటి తీవ్రమైన రిపోర్టింగ్ అక్కర్లేదన్న భావన కలుగక మానదు. ఇవాల్టి రోజున టెక్నాలజీ పెరిగిపోయింది. నిజంగానే విపత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని తీవ్రతను తెలియజేసేందుకు డ్రోన్లను వినియోగించొచ్చు.
దాని ద్వారా రిపోర్టర్లు వెళ్లలేని ప్రాంతాల్లోకి వెళ్లే వీలుంది. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాలతో వార్తలు అందిస్తే ప్రజలు హర్షిస్తారే తప్పించి.. ఇలాంటి అతి ఏ మాత్రం మంచిది కాదు. విపత్తు వేళ.. పరిస్థితి తీవ్రతను ప్రేక్షకులకు.. పాఠకులకు తెలియజెప్పేందుకు ప్రయత్నించటం ఫర్లేదు కానీ.. ఆ పేరుతో ఇలాంటి సిత్రవిచిత్ర చేష్టలు చేయాల్సిన అవసరం లేదు.