‘‘కేవలం 10 రోజులలో పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయి. దాదాపు 1200 మందిని అరెస్టు చేశాం. 400 మంది మీద రౌడీ షీట్లు తెరిచాం. నరసరావుపేట జైలు గదులన్నీ నిండిపోవడంతో ఖాళీ లేక నిందితులను రాజమండ్రి జైలుకు పంపుతున్నామని’’ పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. మా మిత్రులు ఫోన్లు చేసి పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని ఆశ్చర్యపోతున్నారని, నరసారావుపేట, మాచర్ల పేర్లు చెడుగా మార్మోగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరం. కర్రలు, రాడ్లు చేతులతో పట్టుకుని తిరగడం, దాడులు చేయడం అవసరమా? అని మల్లికా గార్గ్ ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చుని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయట రోడ్లపై ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తేలేదని ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.
గొడవల్లో జైళ్లకు వెళుతున్న వారంతా సామాన్యులే, నాయకులు మాత్రం డబ్బు, తెలివి తేటలతో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు. గొడవల్లో బలవుతున్నది సామాన్య ప్రజలే. నాయకుల కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. కౌంటింగ్ రోజు ఎవరైనా తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, పోలీస్ యూనిఫాం పవర్ ఏమిటో చూపిస్తాం అని మల్లికాగార్గ్ హెచ్చరించారు.