ఏపీలో 2024 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా వారు వెలువరించారు. ఈ జాబితాలో అందరినీ ఆకర్షించిన అంశం.. మహిళా ఓటు బ్యాంకు. పురుష ఓట్లకంటే కూడా.. ఏపీలో మహిళా ఓటు బ్యాంకు గత 2019 ఎన్నికలతో పోల్చుకుంటే భారీగా పెరిగింది.
ఎన్నికల అధికారుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో మహిళల ఓట్లు వెయ్యికి 30 చొప్పున ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితాతో పోల్చితే… తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య 2,36,586 పెరిగింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 3,94,05,967. ఇప్పుడు ముసాయిదా జాబితా ప్రకారం 4,02,21,450 మంది ఓటర్లున్నట్లు తేలింది.
ప్రధానంగా రాష్ట్రంలో పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 1,98,31,791 కాగా… మహిళా ఓటర్ల సంఖ్య 2,03,85,851. అంటే… పురుషులకంటే మహిళా ఓట్లు 6,17,458 ఎక్కువ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏ పార్టీకైనా మహిళల ఆశీర్వాదం అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. ప్రజల్లోకి వస్తున్నారు.
ఆమె చేస్తున్న ప్రసంగాలు.. వ్యాఖ్యలు కూడా.. సూటిగా మహిళలను హత్తుకులనే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అంటే.. మొత్తంగా మహిళలను ప్రభావితం చేయగల శక్తి.. నారా కుటుంబంలోని భువనేశ్వరికి ఉందనే ప్రచారం పెరిగింది. మరోవైపు.. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో ప్రచారం చేసిన సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ, ఆయన సోదరి షర్మిల ఇప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు. అంటే.. జగన్ కుటుంబం నుంచి మహిళలు ప్రచారంలోకి వచ్చే పరిస్థితిలేదు. దీనిని బట్టి మహిళా ఓటు బ్యాంకును ప్రభావితం చేయడంలో నారా భువనేశ్వరి కీలకంగా మారనున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.