ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా కనిపించిన మంచు కుటుంబంలో కొంత కాలంగా పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కుటుంబం నుంచి వేరైపోయాడు. అన్న మంచు విష్ణుతో మనోజ్‌కు తీవ్ర విభేదాలే నెలకొన్నాయి. అవి ఎంతకీ సద్దుమణగట్లేదు. తరచుగా విష్ణు మీద మనోజ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి మనోజ్.. విష్ణు మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కారు కనిపించకుండా పోయిందని.. అది విష్ణు మనుషుల పనే అని మనోజ్ ఆరోపించాడు. తన పాప పుట్టిన రోజు వేడుకల కోసం జైపూర్ వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని విష్ణఉ తన కారుతో పాటు అనేక వస్తువులను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
‘‘ఈ నెల 1న మా పుట్టిన రోజు సందర్భంగా మేం జైపూర్‌కు వెళ్లాం. ఆ సమయంలో నా సోదరుడు విష్ణఉ తన మనుషులు 150 మందితో జల్పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారు. జల్పల్లిలోని నా సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా దాడి చేశారు. కారు దొంగతనం గురించి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది విష్ణు ఇంట్ోల ఉన్నట్లు గుర్తించారు. రికవరీకి వెళ్లినపుడు దాన్ని మాదాపూర్‌కు పంపించారు’’ అని మీడియాతో మనోజ్ తెలిపాడు.
బుధవారం ఉదయం జల్పల్లిలోని ఇంటి ముందు మనోజ్ నిరసన చేశాడు. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించగా.. గేటు తెరవకపోవడంతో అక్కడే మనోజ్ బైఠాయించాడు. ఈ గొడవ నపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ మంచు కుటుంబం గొడవ మళ్లీ రోడ్డుకెక్కడం ఆ కుటుంబ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు సమసిపోవాలని కోరుకుంటున్నారు.