సీఎం జగన్, వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండబెడుతున్న రఘురామ….జగన్ పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతుంటారు. అయితే, రఘురామను డైరెక్ట్ గా ఎదుర్కోవడం సాధ్యపడకపోవడంతో కొందరు వైసీపీ నేతలు, వారు అనుచరులు….రఘురామను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే తనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి మేకతోటి సుచరిత తనపై చేసిన ట్వీట్లకు రఘురామ కౌంటర్ ఇచ్చారు. తనపై ట్వీట్లు పెట్టిన వారిని అభినందిస్తున్నానని, త్వరలో 150 మంది ఎమ్మెల్యేలతో కూడా ట్వీట్లు పెట్టిస్తారేమోనంటూ రఘురామ చురకలంటించారు. తెర వెనుక ఉండి ట్వీట్లు పెట్టించ వద్దని జగన్ కు రఘురామ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అయిన సీఎం జగన్ ఆయన పేరు మీదుగా ఇలాంటివి పెట్టరని, పక్క వాళ్ళ పేరు మీద పెట్టిస్తారని సెటైర్లు వేశారు.
అయితే, వైసిపి నేతలు ఎంత రెచ్చగొట్టినా తాను రెచ్చిపోనని, మూకుమ్మడి దాడికి భయపడే ప్రసక్తే లేదని రఘురామ స్పష్టం చేశారు. 150 మంది ట్వీట్లతో రావయ్య జగన్మోహన అంటూ రఘురామ సవాల్ విసిరారు. మేకతోటి సుచరిత కవయిత్రి అని చురకలంటించారు. అయోధ్య రామిరెడ్డి గొప్ప కవి అని, తానేటి వనిత ట్వీట్ ను తాడేపల్లి ప్యాలెస్ లో వండారని పంచ్ లు వేశారు. అయితే, వారికి ట్విట్టర్లో పెద్దగా ఫాలోయింగ్ లేదని, తనపై ట్వీట్స్ చేసి ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారని రఘురామ సెటైర్లు వేశారు.