దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? అసలు దేశాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది.. అంటూ.. తరచుగా వ్యాఖ్యలు చేసే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా.. అదే కాంగ్రెస్‌పై మరో రూపంలో విరుచుకుపడ్డారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మోడీ గాలి తీసేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. ప్రపంచ దేశాల్లో మాత్రం డబ్బా కొట్టుకుంటున్నారని మోడీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. మోడీ గురించి తెలుసుకోవాలంటే.. భారత్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండాలని ఆయన అమెరికన్లకు సూచించారు. ఆయా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
అయితే..పరోక్షంగా ఇప్పుడు నరేంద్ర మోడీ.. రాహుల్ వ్యాఖ్యలపైనే రియాక్ట్ అయ్యారు. తాను దేశం కోసం అహర్నిశలూ పాటు పడుతున్నానని.. కానీ, తనకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ దుష్టపన్నాగాలు పన్నుతోందని వ్యాఖ్యానించారు. “నేను దేశాన్ని నిర్మిస్తున్నాను. కానీ, కాంగ్రెస్ నా కు సమాధిని నిర్మిస్తోంది“ అంటూ..పరోక్షంగా ఆయన రాహుల పై విరుచుకుపడ్డారు. తనకు ప్రజల ఆశీర్వాదాలే రక్షణ కవచాలని తెలిపారు. పేదల డబ్బును కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేసిందని ధ్వజమెత్తారు.
త్వరలోనే ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మోడీ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. మైసూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికలకు కొద్ది మాసాల ముందు.. మోడీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించడం.. ఇటీవల కాలంలో ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే. ఇక, కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న మోడీ.. సుమారు 1700 కోట్ల అభివృద్ధి పనులను ఎన్నికలకు ముందు ప్రారంభించడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఆయన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? మోడీకి సమాధి కట్టాలని కాంగ్రెస్ కలలు కంటోంది. నా సమాధి కట్టాలనుకునే కాంగ్రెస్ నేతలకు తెలియదు.. నాకు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదముందని. ఆ ఆశీర్వాదమే నాకు రక్షణ కవచం. పేదలను ఇబ్బందులకు గురి చేసే వారిని నేను వదిలిపెట్టను“ అని మోడీ వార్నింగ్ ఇచ్చారు.