”ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఘోర అవమానం…మంత్రిపై పోలీసుల దురుసు ప్రవర్తన… శారదా పీఠం వద్ద అప్పలరాజు నిరసన…మనస్తాపంతో వెనుదిరిగిన అప్పలరాజు… ఉన్నతాధికారులకు పోలీసులుపై ఫిర్యాదు చేసిన అప్పలరాజు….”ఉదయం నుంచి ఈ రకంగా మంత్రి అప్పలరాజు విశాఖ పర్యటనపై ప్రచారం జరుగుతోంది. ఈ రోజు విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవానికి సీఎం జగన్ వెళ్తుండగా…ఆయనతో పాటు లోపలికి వెళ్లే సందర్భంలో మంత్రిని పోలీసులు అవమానించారంటూ ప్రచారం జరిగింది.
సీన్ కట్ చేస్తే..అసలు జరిగింది ఇదని తాజాగా ఆ వ్యవహారంలో మరో కోణం బయటకు వచ్చింది. సీఎం జగన్ రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రికి మాత్రమే అనుమతి ఉందని, ఆయన ఒక్కరే లోపలకు వెళ్లాలని సూచించారు. మంత్రి అనుచరులను లోపలకు పంపించబోమని ఒక సీఐ స్పష్టం చేశారు. దీంతో, పోలీసుల తీరుపై మంత్రి అప్పలరాజు బూతు పురాణం విప్పారని తెలుస్తోంది.
ఎస్ఐ బూతులు తిట్టారంటూ మంత్రి అనుచరులు ప్రచారం చేశారని…కానీ, అసలు పోలీసులను బూతులు తిట్టింది మంత్రి అప్పలరాజేనని ఆరోపణలు వస్తున్నాయి. అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మంత్రి అప్పలరాజు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న దాంట్లో వాస్తవం లేదని, మంత్రిపై పోలీసులు అలా చేసే అవకాశాలు తక్కువని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి, ఈ వ్యవహారంపై మంత్రి సీదిరి అప్పలరాజు ఎలాంటి వివరణనిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.