ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇచ్చిన మాటను మూడు రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యాశాఖపై లోకేష్ దృష్టి సారించారు. జూన్ 15 తేదీన ఉండవల్లి లోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు.
అయితే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందన్న విషయాన్ని ఈ సమావేశంలో తెలుసుకున్న లోకేష్ అధికారులపై సీరియస్ అయ్యారు. పుస్తకాలు లేకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. ఈ విద్య సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ తో పాటు బ్యాక్ ప్యాక్ అందజేయాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే జూలై 15 నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేయాలని లోకేష్ సూచించారు. దాంతో అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించారు. మంగళవారం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో ఎం.ఎస్. నెం.28ని విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లో పుస్తకాల పంపిణీ కూడా స్టార్ట్ కానుందని అధికారులు చెబుతున్నారు. కాగా, మరోవైపు లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఈవీఎంల విషయంలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలను అనుమానిస్తూ జగన్ ట్వీట్ చేయడంతో.. `2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేశాయన్నారు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై తప్పంటున్నారా?` అంటూ లోకేష్ సోషల్ మీడియా ద్వారా మండిపడ్డారు.