కొత్త ఏడాదిలో మిగతా ఫిలిం ఇండస్ట్రీలు ఆశించిన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’ ఒక్కటే బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత పెద్ద హిట్ అంటే ‘టిల్లు స్క్వేర్’యే. మిగతా సినిమాలు ఏవీ ప్రేక్షకులను అలరించడంలో, వసూళ్లు పరంగా పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. కానీ మలయాళ ఫిలిం ఇండస్ట్రీ మాత్రం కొత్త ఏడాదిలో బ్లాక్బస్టర్ల మీద బ్లాక్బస్టర్లు కొడుతోంది.
పైగా అన్ సీజన్ అయిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ ఇండస్ట్రీ నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తున్నాయి. అన్వేషిప్పిన్ కండేదుం, ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. ఈ నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్‌కు పెద్దగా కలిసి రాని ఫిబ్రవరి నెలలో రిలీజై బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. వీటిలో ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్ తెలుగులోనూ రిలీజై మంచి స్పందన తెచ్చుకున్నాయి.
గత నెలలో వచ్చిన ‘ది గోట్ లైఫ్’ సైతం మలయాళంలో పెద్ద హిట్టయింది. ఆ చిత్రం తెలుగులోనూ రిలీజై ఓ మాదిరి స్పందన తెచ్చుకుంది. కాగా ఇప్పుడు మలయాళం నుంచి రిలీజైన ఇంకో చిత్రం సూపర్ హిట్టయ్యేలా కనిపిస్తోంది. అదే.. ఆవేశం. ‘పుష్ప’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో ‘ఆవేశం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ వీకెండ్లో రిలీజైన ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది.
గత ఏడాది ‘రోమాంచం’ అనే ఫన్నీ మూవీతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న జీతు మాధవన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రివ్యూలు, మౌత్ టాక్ చాలా బాగుండడంతో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. హైదరాబాద్‌లో మలయాళం వెర్షన్ షోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫాహద్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం కాబట్టి.. ఈ చిత్రాన్ని కూడా తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయడం పక్కా కావచ్చు.