జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా రివర్స్ పాలన జరుగుతోందని టీడీపీ నేతలు, విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. రివర్స్ టెండర్లంటూ పోలవరం మొదలు డ్రైనేజి కాలువల వరకు నిర్మాణ పనులన్నీ రివర్స్ లో సాగుతున్నాయని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విద్యుత్ చార్జీల విషయంలోనూ జగన్ రివర్స్ గేర్ వేయడంపై విపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం అయిన తర్వాత 6 సార్లు విద్యుత్ చార్జీలను పెంచిన జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
జగన్ విద్యుత్ చార్జీల పెంపును జగన్ ఉగాదిబాదుడుగా లోకేశ్ అభివర్ణించారు. విద్యుత్ చార్జీల పెంపుతో జగన్‌కే షాక్ కొట్టినట్టుగా ఉన్న ఓ ఫొటోను లోకేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. .షాక్ లగా…షాక్ లగా…అంటూ ఓ ప్రముఖ కంపెనీ యాడ్ ను ఇమిటేట్ చేసేలా జగన్ కు షాక్ తగిలి జుట్టంతా పిచుకగూడులా ఉన్న ఫొటోను తన పోస్ట్‌కు యాడ్ చేశారు. ఇప్పటికే పెట్రోల్ ఏపీలోనే అత్యధికమన్న విషయాన్ని ప్రస్తావించిన లోకేశ్.. జనంపై మరో భారం వేస్తూ జగన్ సర్కారు విద్యుత్ చార్జీలను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క పెట్రోల్, డీజిల్ ధరలు.. మరో పక్క విద్యుత్ చార్జీలు..బాదుడే బాదుడు.. వీర బాదుడు అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.
‘‘జగన్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివర్స్ చేస్తాడంతే! మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్, మడమ తిప్పుడుకి ఐకాన్ @ysjagan. కరెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జగన్ తీసిన దీర్ఘాలు స్థాయిలోనే మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైసలు పెంచడం ఏ రేంజ్ బాదుడో జగన్‌రెడ్డే చెప్పాలి. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. షాక్ ఇంత చాలునా…ఇంకా కొంచెం పెంచానా అంటూ జగన్ చేతుల్లో కరెంటు తీగలు పట్టుకున్న ఫొటో వైరల్ అయింది.