వైసీపీ పాలనలో ఏపీ రావణ కాష్టంలో మారిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో సీఎం జగన్ పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని, ఫ్యాక్షన్ , కక్షపూరిత రాజకీయాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
వైసీపీ నేతలు బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం లక్కరాజుగార్లపాడు గ్రామంలో ఇటీవల గరికపాటి కృష్ణారావు అనే టీడీపీ కార్యకర్త మృతి చెందాడు. వైసీపీ శ్రేణుల దాడిలోనే కృష్ణారావు మరణించాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు పరామర్శించారు.
కృష్ణారావుకు నివాళులు అర్పించిన లోకేశ్…ఆ కుటుంబానికి టీడీపీ తరఫున రూ.6 లక్షల ఆర్థికసాయం అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేశ్ నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ సైకోరెడ్డి రాక్షసానందం పొందుతున్నాడని, లెక్కలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కృష్ణారావు హత్య జగన్ అరాచకపాలనకు నిదర్శనమని, అరాచకాలలో బిహార్‌తో ఏపీ పోటీ పడుతోందని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి గుర్తు పెట్టుకో.. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని లోకేశ్ హెచ్చరించారు. పోలీసులు లేకుండా ప్రజల్లోకి రావొద్దని, వస్తే జనం తరిమి కొడతారని జగన్ కు లోకేశ్ సలహా ఇచ్చారు. ఏపీలో మహిళా హోంమంత్రి ఉన్నా మహిళలకు రక్షణ లేదని లోకేశ్ విమర్శించారు.