సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి, ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వివేకా దారుణ హత్యకు గురికాగా…ఆ ఘటన జరిగి రెండేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ నిందితులెవరో గుర్తించకపోవడంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
విపక్ష నేతలే కాదు…స్వయాని వివేకా కూతరు సునీతా రెడ్డి కూడా తన తండ్రి హత్యకేసులో న్యాయం చేయాలంటూ ఢిల్లీ వరకూ వెళ్లారంటే ఆ కేసు విచారణ ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి హత్య కేసులో ఏపీ ప్రభుత్వం సహకారం ఉండి ఉంటే తాను ఢిల్లీలో సీబీఐ ఆఫీసు గడప తొక్కాల్సిన అవసరం వచ్చేది కాదని స్వయంగా సునీత చెప్పడం….ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ప్రశ్నించాలని మీడియాకు చెప్పడం సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. సునీత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పు అబ్బాయ్ అంటూ జగన్ కు లోకేశ్ చురకలంటించారు. సునీత ప్రశ్నలకు సమాధానమివ్వాలని జగన్ ను నిలదీశారు.
మీ చిననాయనని మా నాయన నరికేశాడన్నావు.. సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు…ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు.. సమాధానం చెప్పు సైకోరెడ్డి అని లోకేశ్ ట్విటర్ వేదికగా జగన్ ను ఏకి పారేశారు. వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు.. ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ ఇపుడు గజగజా వణుకుతున్నాడంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. అంతా అడిగినట్టే..తాను కూడా వివేకానందారెడ్డి హత్య కేసు గురించి అడుగుతున్నానుని, దానికి సమాధానం చెప్పాలని లోకేశ్ ప్రశ్నించారు.
అంతకుముందు, పార్లమెంట్ కి జగన్ రోబోలను పంపాడని, మోదీ గారు కనపడితే కాళ్ల మీద పడటం, బీజేపీ ఏ బిల్లు తెచ్చినా కనీసం చూడకుండా ఎస్ చెప్పడం రోబోల పని అంటూ వైసీపీ ఎంపీలపై లోకేశ్ సెటైర్లు వేశారు. ఆకాశంలో ఉన్న జగన్ రెడ్డిని భూమ్మీదకి తీసుకురావడానికి ఆ శ్రీవారు అవకాశం ఇచ్చారని, తిరుపతి ప్రజలు పనబాక లక్ష్మికి ఓటేసి పార్లమెంటుకు పంపాలని, పనికిమాలిన వైసీపీ ఎంపీలను పార్లమెంటుకు పంపితే ఏం ఉపయోగం లేదని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న లోకేశ్ చురకలంటించారు. జగన్ పై లోకేశ్ సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.