ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అలవిగాని హామీలిచ్చి ఈ రోజు నాలుక కరుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక, సీఎంగా అయిన తర్వాత కూడా జగన్ తీరు మారలేదు. అందుకే, తానిచ్చిన కొన్ని హామీలకు ఏకంగా చట్టబద్ధత కూడా కల్పించి జనాల్లో నమ్మకాన్ని పెంచుదామనుకున్నారు. ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు అని అసెంబ్లీలో చట్టం చేసి జీవో కూడా తెచ్చారు. కానీ, మాట తప్పను మడమ తిప్పు అని చెప్పే జగన్…కుడి ఎడమైతే పొరపాటు లేదంటూ మాట, మడమ తిప్పుతూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తమకు ఉద్యోగాలు కావాలంటూ నిరసన తెలిపిన స్థానికులపై విజయనగరం జిల్లాలో లాఠీలు ఝుళిపించారు జగన్. దీంతో, జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు.విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ లోని మైథాన్ కంపెనీ కర్మాగారాన్ని తెరిచి తమకు ఉపాధి కల్పించాలంటూ మహిళా కూలీలు ఆందోళనకు దిగారు. పొరుగు రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకోవద్దంటూ నినాదాలు చేశారు.
దీంతో, వారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో, ఈ ఘటనపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న అన్నందుకు గన్ లు పట్టుకున్న పోలీసులను అక్కచెల్లెమ్మలపైకి పంపారా సీఎం జగన్ గారూ? అంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎకరాలు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని కోరిన మహిళలపై పోలీసులతో లాఠీచార్జి చేయడమేనా అక్కచెల్లెమ్మలకు మీరిచ్చే బహుమతి! అంటూ మండిపడ్డారు.
స్థానికులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్ నేరమైతే, స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు అని జీవో తెచ్చి అమలు చేయని మీరు ఏ1 ముద్దాయి అని లోకేశ్ విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం అని మర్చిపోయారని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనే సంగతి పోలీసులకూ గుర్తు రాదని ఎద్దేవా చేశారు. బాధిత మహిళలకు టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ అభయమిచ్చారు.