ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. నేతలు ఒకటి తలిస్తే.. అధినేత మరొకటి చేస్తూ షాక్ ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త బాస్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరాంధ్రలోని వైసీనీ నేతల ఆగ్రహానికి కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్న కూడా ఎంపీ పదవికి, వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆయన రాజీనామాతో ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ స్థానం ఖాళీ అయింది. ఆ పదవి కోసం వైసీపీలో విపరీతమైన పోటీ ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఆ పదవి తమకే దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాణ, గుడవాడ అమర్ నాథ్, ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని వంటి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ అధినేత జగన్ మాత్రం జిల్లా వైసీపీ నేతలు షాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు.
ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త సమన్వయకర్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కురసాల సైలెంట్ అయ్యారు. పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. అయినాసరే జగన్ ఏరికోరి ఆయనకు బాధ్యతలు అప్పజెప్పడంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
ఇకపోతే కురసాల కన్నబాబు ఇప్పటివరకు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా అధిష్టానం ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా నియమించడంతో కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. దాంతో జగన్ ఆ స్థానాన్ని మాజీ మంత్రి, తుని నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజాతో భర్తీ చేశారు.