టీపీసీసీ చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల కాంగ్రెస్ లోని పలువురు సీనియర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీహెచ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి పలువురు నేతలు రేవంత్ పై గుర్రుగా ఉన్నారు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ తో సభ పంచుకోవాల్సి వస్తే…కోమటిరెడ్డి ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ ఉంది.
ఈ క్రమంలోనే ఈ నెల 18న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ చేపట్టదలచిన దళిత దండోరా సభ ఆసక్తి రేపుతోంది. దీంతో, కోమటిరెడ్డి తప్పనిసరిగా ఆ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ సభకు తాను హాజరు కాలేనని, దానిని వాయిదా వేయాలని రేవంత్ కు కోమటిరెడ్డి స్వయంగా ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారాన్ని కోమటిరెడ్డి ఖండించారు.
తాను ఎవరికీ ఫోన్ చేయలేదని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే, ఇబ్రహీంపట్నంలో సభ పెట్టడంపై తనకు రేవంత్ మాట మాత్రమైనా చెప్పలేదని కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయంలో రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రేవంత్ తీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు, ఇబ్రహీంపట్నంలో జరపదలుచుకున్న సభకు పోలీసులు అనుమతివ్వలేదు. సాగర్ హైవే పక్కన పోలీస్ స్టేషన్ సమీపంలో సభ నిర్వహించాలని రేవంత్ భావించగా…పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో, అవుటర్ రింగురోడ్డు పక్కన బొంగుళూరు సమీపంలోని స్థలంలో సభ నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మరి, కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ సమస్యకు కాంగ్రెస్ అధిష్టానం ఏ పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.