రెంటికీ చెడ్డ రేవడి అన్న పదాలు ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని కి సరిగ్గా సరిపోతాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని.. టీడీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో టీడీపీ తరపున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరిన కొడాలి నానీని జగన్ టీడీపీపై ఒక అస్త్రంగా వాడుకున్నారు. జగన్ సపోర్ట్ తో కొడాలి ప్రతిపక్షాలపై నోరేసుకుంటూ వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.
నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ తో సహా విపక్ష నేతలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి సొంత సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి.. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలికి జగన్ తన క్యాబినెట్లో చోటు కల్పించారు. కానీ పలు కారణాల వల్ల 2022లో ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించారు.
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ధాటికి కొడాలి విజయ యాత్రకు బ్రేకులు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతుల్లో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మీడియాకు, రాజకీయ వ్యాఖ్యలకు కొడాలి చాలా దూరంగా ఉంటున్నారు. పార్టీలోకి కూడా కొడాలి పేరు వినిపించడం లేదు. దీనికి తోడు జగన్ తాజాగా ఆయనకు బిగ్ షాక్ ఇచ్చారు.
ఏపీని ఆరు ప్రాంతాలుగా విభజించి వాటికి వైసీపీ తరపున ఆరుగురు కోఆర్డినేటర్లను జగన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే కోఆర్డినేటర్ల నియామకంలో జగన్ తన సమాజిక వర్గానికే పెద్ద పీట వేశారు. పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్ల జాబితాలో ఐదుగురు రెడ్లే ఉండగా.. సీనియర్ నేత బొత్స కు ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ తనకు అత్యంత నమ్మకస్తుడైన కొడాలి నానిని మాత్రం జగన్ పట్టించుకోలేదు. ఈ విషయంలో జగన్ పై కొడాలి గరంగరంగా ఉన్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే నోటి దురుసు కారణంగా సొంత సామాజిక వర్గానికి కొడాలి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ కూడా తనను పక్కన పెట్టేడంతో కొడాలి జీర్ణించుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది.