సూటిగా.. స్పష్టంగా.. ఎక్కడా ఎలాంటి సందేహాలకు తావు లేకుండా తేల్చేసింది కేరళ రాష్ట్ర హైకోర్టు. చిన్నా కావొచ్చు.. పెద్ద కావొచ్చు.. స్త్రీ అన్న తర్వాత ఆమె శరీరం మీద పూర్తి హక్కులు ఆమెకే. అంతేకాదు.. జననాంగంలోకి పురుషాంగాన్ని జొప్పిస్తే తప్పించి.. అది రేప్ కాదన్న దరిద్రపుగొట్టు వాదనల్ని బద్ధలు కొట్టేయటమే కాదు.. మొత్తం విషయాన్ని రెండు ముక్కుల్లో తేల్చేశారు. స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని అయినా సరే.. పురుషాంగం కానీ టచ్ చేస్తే.. అది అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
సంచలనంగా మారిన కేరళ హైకోర్టు తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఇదే విధానాన్ని అందరూ పాటిస్తే చాలానే మార్పులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదకొండేళ్ల బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ తప్పు చేయలేదన్నాడు. సదరు బాలిక జననాంగంలోకి అంగప్రవేశం జరగని నేపథ్యంలో దాన్ని అత్యాచారం కింద పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ఘటన జరిగిన ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు కోర్టును ఆశ్రయించటం ఏమిటన్న వాదనను వినిపించారు.
నిందితుడి తరఫు న్యాయవాది వాదనల్ని చూస్తే.. సెక్షన్ 375 ప్రకారం కేసును నమోదు చేశారని.. అంగప్రవేశం జరిగితేనే ఇలాంటి కేసులు పెట్టాలన్నారు. ఐపీసీలో అత్యాచారానికి ప్రత్యేక నిర్వచనం ఉందన్నారు. ఈ వాదనను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. జననాంగం.. మూత్రనాళం.. నోరు లాంటివి మాత్రమే కాదు.. ఇతర భాగాలపై కూడా పురుషాంగంతో ఎలాంటి స్పర్శకు కారణమైనా.. దాడి చేసినా అది లైంగిక దాడిగానే పరిగణిస్తామని పేరర్కొన్నారు.
స్త్రీ శరీరంలోని ఏ అవయువంలోకైనా చొచ్చుకునేందుకు వీలుగా చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అత్యాచారంగా పరిగణించాల్సి వస్తుందని.. దానిని లైంగిక దాడిగానే పరిగణిస్తామన్నారు. దీనికి సంబంధించి ఐపీసీ 375(సి) చదివితే అర్థమవుతుందని సదరు న్యాయవాదికి చెప్పింది. దీనికి సంబంధించి కోర్టులకు విచక్షనాధికారాలు ఉన్నాయని పేర్కొంది. ఆర్నెల్ల క్రితం జరిగిన ఘటన గురించి నిందితుడి వాదన ప్రకారం.. అప్పట్లో తాను ఎలాంటి లైంగిక దాడి చేయలేదని.. కేవలం తన పురుషాంగం స్త్రీ తొడలకు మాత్రమే తగిలినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
దీనికి స్పందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాధితురాలికి పలుమార్లు బలవంతంగా పోర్న్ సినిమాలు చూపించేవాడని.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. దీనికి స్పందించిన హైకోర్టు సదరు వ్యక్తి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిర్దారిస్తూ.. పలు సెక్షన్ల కింద అతడు చేసింది లైంగిక చర్యల కిందకే వస్తాయని పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాదు.. నిందితుడికి జీవితఖైదు శిక్షను యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు తాజా తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.