ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. వల్ల కాలేదని ఇంకొకరు ఏడ్చాడంట అన్న చందంగా మారింది ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు (గురువారం) ఈడీ ఎదుట విచారణ కానున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నవేళ.. రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై బీఆర్ఎస్ నేతలు.. అభిమానులు పెద్ద ఎత్తున చిందులు తొక్కేస్తున్నారు. మోడీ దుర్మార్గంతోనే ఇదంతా జరుగుతుందే తప్పించి.. కవితక్క సుద్దపూసగా పలువురు అభివర్ణిస్తున్నారు.
మరోవైపు.. తప్పు ఎవరు చేసినా అందుకు శిక్ష తప్పదన్న మాట మరికొందరి నోటి నుంచి వస్తోంది. ఏమైనా.. తాజా పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. సందట్లో సడేమియా అన్న చందంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. ఈడీ విచారణకు రెండోసారి హాజరు కానున్న కవితక్కను అధికారులు అరెస్టుచేస్తారా? లేదంటే విడిచి పెడతారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళలోనే.. బెట్టింగ్ అనే దరిద్రం ఒకటి తెర మీదకు వస్తుంది.
హాట్ టాపిక్ ఏదైనా సరే.. బెట్టింగులోకి దించేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది. ఈ క్రమంలో కవిత అరెస్టుపైన కూడా ఇదే ధోరణిలో భారీ ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివి మీదా.. ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉన్న వారు.. కవితక్కకు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ కాదని.. ఆమె అరెస్టు అయ్యే చాన్సే లేదని స్పష్టం చేస్తుంటే.. మోడీషాల తీరును అవపోశన పట్టినట్లుగా ఫీలయ్యే వారు మాత్రం.. కవితక్క కచ్ఛితంగా అరెస్టు అవుతారంటూ బెట్టింగులకు దిగుతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే అన్న సామెత గుర్తుకు రాక మానదు. అయినా.. ఒకరు వేదన చెందే విషయంపైనా బెట్టింగులకు దిగటం అయితే సరికాదన్న మాట వినిపిస్తోంది.