తుదిశ్వాసలోనూ శంకరాభరణం.. రిలీజ్ డేట్ నాడే.. గతాన్ని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్
తెలుగు సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లటమే కాదు.. దేశీయ సినిమాకు సరికొత్త సొగసులు అద్దిన కళాతపస్విగా సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ కు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కళల్ని తన సినిమాతో ఆయన చెప్పే తీరు అంతకు ముందు మరెవరూ చేయలేదనే చెప్పాలి. సినీ చరిత్రలో ఆయన తీసిన శంకరాభరణం ఒక మైల్ స్టోన్ లా నిలిచిపోవటమే కాదు.. సినిమాల గురించి చర్చ మొదలైతే.. శంకరాభరణం ముందు.. తర్వాత అన్నట్లుగా చర్చలు సాగే పరిస్థితి.
ఆయన దర్శకత్వంలో తీసిన సినిమాల కారణంగా.. పలువురు ప్రతిభావంతులు ప్రపంచానికి తెలిసేలాచేసిన కీర్తి కె.విశ్వనాథ్ సొంతంగా చెప్పాలి. ఆయనతీసిన సిరివెన్నెల మూవీతోనే.. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. చివరకు ఆయన ఇంటిపేరుగా మారింది. సిరివెన్నెలకు ముందు వేటూరి సుందరరామ్మూర్తిని తెలుగు సినిమాకు పరిచయం చేసిన క్రెడిట్ కె. విశ్వనాథ్ కే చెల్లుతుంది.
కె.విశ్వనాథ్ అన్నంతనే గుర్తుకు వచ్చే సినిమాల్లో మొదట నిలిచేది శంకరాభరణం. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా విడుదలైన ఈ మూవీ.. అప్పట్లో పెను సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద బారులు తీరిన వైనం.. అప్పట్లో శంకరశాస్త్రి పాత్ర మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.
శంకరాభరణం మూవీ విడుదలైంది 1980 ఫిబ్రవరి 2న. ఈ సినిమా విడుదలైన 44 సంవత్సరాలకు.. ఏ రోజైతే సినిమా విడుదలైందో.. అదే రోజున కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడవటం చూసినప్పుడు ఆయన మరణంలోనూ శంకరాభరణం ఉండటాన్ని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.