రోజు రోజుకూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు తగులుతున్న నిరసన సెగలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ తాజాగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జగన్ చాలామంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
అంతేకాదు, పనితీరు సరిగా లేని వారికి జగన్ వార్నింగ్ కూడా ఇచ్చారని పుకార్లు వినిపిస్తున్నాయి. పనితీరు మెరుగు పరుచుకుంటే రాబోయే ఎన్నికల్లో వేటు తప్పదని 32 మంది ఎమ్మెల్యేలను జగన్ హెచ్చరించారని తెలుస్తోంది. ఆ 32 మందిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారట. రాబోయే 100 రోజులు పార్టీకి చాలా కీలకమని, తీరు మార్చుకోని వారి స్థానంలో కొత్త అభ్యర్థులు వస్తారని తేల్చి చెప్పారట.
అయితే, పాతవారికే టికెట్లు ఇవ్వాలని తనకుందని, కానీ, వారిపై వేటు వేసే పరిస్థితిని వారే కొనితెచ్చుకుంటున్నారని జగన్ కుండబద్దలు కొట్టారట. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజులు పాల్గొనాలని గత మీటింగ్ లో చెప్పినా…32 మంది దాన్ని సీరియస్ గా తీసుకోలేదని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి నివేదికలో చెప్పారట. ప్రతి రోజు ఒక సచివాలయం పరిధిలో 6-8 గంటల సేపు పర్యటించాలని జగన్ చెప్పగా, కొందరు గంట నుంచి రెండు గంటలే పర్యటిస్తూ 30 రోజులు పూర్తి చేశారట. అలా 20 మంది చేసినట్టుగా నివేదికలో తేలడంతో వారిపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారట.