పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసం దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అసలు కంటే కొసరు విషయాలతో వార్తల్లోకి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడుల వరద కురిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావంటూ పెద్ద ఎత్తున భజన కార్యక్రమాన్ని ఆయన అనుకూల మీడియా చేస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం దర్శనమిస్తోంది. గన్నవరం నుంచి దావోస్ కు నేరుగా వెళుతున్నట్లుగా ఆయన అధికారిక షెడ్యూల్ చెబితే.. అందుకు భిన్నంగా ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం మాత్రం లండన్ వెళ్లటం తెలిసిందే.
దీనిపై జరగాల్సినంత చర్చ జరగటమే కాదు.. వైసీపీ నేతల ఎంట్రీతో అది కాస్తా మరింత రచ్చగా మారిన వైనం తెలిసిందే. ఇది సరిపోనట్లుగా తాజాగా వెలుగు చూసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారాయి. అందులో ఒక ఫోటో.. జగన్ టీంకు ‘బ్లూ’ మీద ఉన్న అభిమానాన్ని దావోస్ లో సైతం ప్రదర్శించిన తీరు షాకింగ్ గా మారింది. ఏపీ అధికార పార్టీ జెండాను చూస్తే.. ఆయనకు బ్లూ మీద ఉన్న ప్రత్యేక అభిమానం ఇట్టే అర్థమవుతుంది.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత. పార్టీ రంగులతో జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్ని ఏదో ఒక సమయంలో రివర్సు కొట్టటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శల్ని మూట కట్టుకునేలా చేసింది. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలకు కారణమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా దావోస్ కు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు.. ఆయన చేతికి పూలబొకేల్ని ఇచ్చేందుకు.. వైసీపీ నేతలు.. ఏపీ అధికారులు వరుస కట్టటం ఒక ఎత్తు అయితే.. వారందరి డ్రెస్సులు ‘బ్లూ’తో ఉండటం చూస్తే.. బ్యాండ్ మేళంకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఉందన్న విమర్శ వినిపిస్తోంది.
ఏపీ అధికార పార్టీ నేతలకు బ్లూ మీద ప్రత్యేక అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధికారులు సైతం బ్లూ కలర్ సూట్లను ధరించటాన్ని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ మాత్రం.. క్రీం కలర్ ఫ్యాంట్ మీద.. బ్లాక్ కలర్ సూట్ వేసుకొని మిగిలిన వారికి భిన్నంగా దర్శనమిచ్చారు. ఏమైనా.. పార్టీకి చెందిన బ్లూ కలర్ ను నేతలు.. అధికారులు విడిచిపెట్టకుండా తమ డ్రెస్సుల్లోనూ చూపిస్తూ.. తమకున్న అభిమనాన్ని.. విధేయతను ప్రదర్శించిన తీరుపై ఆసక్తి వ్యక్తమవుతోంది.