వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. జగన్ అస్తవ్యస్థ నిర్ణయాలతో ఏపీ భవిష్యత్తు అంధకారంగా మారిందని, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై జగన్ కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ రోమ్ చక్రవర్తి నీరోను ఎన్నుకున్నామన్న భావనలో ఏపీ ప్రజలున్నారని సెటైర్లు వేశారు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేయడంతో ఏపీ రుణాంధ్రప్రదేశ్ గా మారిందని, త్వరలోనే దివాలాంధ్రప్రదేశ్గా మారే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్ఆర్ఆర్ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం మద్యం ధరలు పెంచి ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారని, ఈ ప్రకటన తమ పార్టీకి ప్రమాదమేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కలియుగ దైవం తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటని, జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రిస్టియానిటి పెరిగిందని అన్నారు. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు.
ఇన్నిరోజులు ఎర్రచందనం దొంగిలించారని, ఇప్పుడు తలనీలాలు దొంగిలిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని, దీనిపై ఎవరిదైనా ఒత్తిడి ఉందేమో దర్యాప్తు చేయమని త్వరలో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం హోదాలో ఉన్న జగన్ ఛేదించకపోవడం బాధాకరమని చురకలంటించారు.