ముద్రగడ పద్మనాభ రెడ్డి….కాపు ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాజీ కేంద్ర మంత్రి. తూర్పుగోదా వరి జిల్లా కిర్లంపూడికి చెందిన ఈయన.. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు లేఖ సంధించారు. ఈయన గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటానని.. కూడాశపథం చేశారు. అన్నట్టుగానే ఆయన ముద్రగడ పద్మనాభం కాస్తా.. పద్మనాభరెడ్డి అయ్యారు.
ఇక, కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న పద్మనాభానికి తాజాగా వైసీపీ అధినేత.. జగన్ పార్టీ రాజకీయ సలహాదారు కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈయనకంటే.. అనుభవం తక్కువైన.. ఏమాత్రం ప్రజల్లో బలం కూడా లేని.. వార్డు మెంబరుగా గెలవని.. పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పీఏసీకి చైర్మన్గా నియమించారు. అంటే.. ఇప్పుడు సజ్జల సారథ్యంలో ముద్రగడ వంటి బలమైన నాయకుడు, సీనియర్ నేత పనిచేయాల్సివస్తోంది.
సరే.. ఏ చెట్టూ లేని చోట వెంపలి మొక్కే మహా వృక్షం అన్నట్టుగా.. జగన్ ఇచ్చిన ఈ పదవికి ముద్రగడ మురిసిపోయారు. ఆ వెంటనే పెద్ద ఎత్తున పదునైన వ్యాఖ్యలతో.. జగన్ ఉబ్బితబ్బిబ్బయ్యేలా.. ఆయనను ఆకాశానికి ఎత్తేస్తూ.. ముద్రగడ లేఖ సంధించారు. ఈ లేఖలో తనకు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. “తమకు అభిమానంతో ప్రేమతో నాకు ఈ పదవిని ఇవ్వడం టీవీలో చూశానండి“ అని మొదలు పెట్టి.. జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు.
“పేద వారికి మీరే ఆక్సిజన్ అండి. మళ్లీ మీరు అధికారంలోకి వచ్చేందుకు నేను త్రికరణ శుద్ధిగా కష్టపడ తానండి. ఈ దఫామీరు అధికారంలోకి వచ్చాకండీ.. మరో పదేళ్లపాటు మరెవరూ.. ఆ పీఠంపై కన్నేయ కుండా పదికాలాల పాటు మీరే ఉండాలని కోరుకుంటానండి“ అని ముద్రగడ పద్మనాభ రెడ్డి వ్యాఖ్యానిం చారు. అయితే.. అసలు ఇది చిన్నపాటి సలహా కమిటీ. దీనికి పెద్దగా ఏమీ ప్రాధాన్యం ఉండదు. అలాంటి పదవిని ముద్రగడకు ఇవ్వడంపై ఆయన అభిమానులు తల్లడిల్లుతున్నారు. కానీ, ముద్రగడ మాత్రం మెచ్చుకోళ్లతో జగన్ను మురిపిస్తూ.. ఇట్టు.. మీ ముద్రగడ పద్మనాభ రెడ్డి.. అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.