ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటలలోపు క్యూలైన్లలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించింది. రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వందల సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ సారి గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. దీంతో, 2019లో సుమారు 80 శాతం పోలింగ్ నమోదు కాగా…ఈ సారి ఆ శాతం మరింత పెరిగే అవకాశముందని ఈసీ భావిస్తోంది.
సాయంత్రం 7.30 నిమిషాల నాటికి 75 శాతం పోలింగ్ నమోదైందని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ముందుగా చేపట్టడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని మీనా అభిప్రాయపడ్డారు. పల్నాడు జిల్లాలో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని, ఒక ఈవీఎంను ధ్వంసం చేసినా..చిప్ లో డేటా భద్రంగా ఉండడంతో రీ పోలింగ్ అవసరం పడలేదని చెప్పారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయని, ఓవరాల్ గా 11 ఈవీఎంలు ధ్వంసమైనా రీ పోలింగ్ అవసరం పడలేదని, అవి మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. ఇంకా, క్యూలైన్లలో ఉన్న ఓటర్ల పోలింగ్ పూర్తయితే పోలింగ్ శాతం 80 నుంచి 83 మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.