ఈ రోజుల్లో చాలామందిని బాధిస్తున్న సమస్య అధిక బరువు, పొట్ట, ఊబకాయం. భోజనం సరైన సమయానికి తినకపోవడం, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్..ఇలా రకరకాల కారణాలతో చాలామంది ఊబకాయులుగా మారుతున్నారు. అయితే, ఈ ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వారంతా నానా తిప్పలు పడుతున్నారు. రకరకాల వైద్యాలు, ఎక్సర్ సైజులు, న్యూట్రిషియన్ డైట్ లు అంటూ వేలకు వేలు డబ్బు ఖర్చుపెడుతున్నారు.
అయినా, వారిలో చాలామంది ఫలితం దక్కకపోగా…కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది ఊబకాయం తగ్గే మందులు వాడాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే అధిక బరువు తగ్గించేందుకు అమెరికాలోని మార్కెట్లో వచ్చిన ‘వీగోవీ’ అనే ఔషధం వారిపాలిట సంజీవనిలా మారింది. ఈ దివ్యౌషధం కోసం అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారంతా మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ఈ మందుకు ఇప్పుడు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది.
బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి. జూన్ లో దీనికి అనుమతి లభించింది. గతంలో ఈ తరహా మందులు వచ్చినా….వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో, దాని జోలికి ఎవరూ వెళ్ళలేదు. అయితే, వీగోవీ వల్ల సైడ్ ఎఫెక్ట్ లు పెద్దగా లేవని తెలుస్తోంది. దీంతో, దానికి డిమాండ్ పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. ఈ మందు ఇంజెక్షన్ రూపంలో లభిస్తుండగా…వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.
దీని వలన బరువు అనూహ్యంగా తగ్గుతుండడంతో చాలామంది ఎగబడుతున్నారు. ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే వారిలో ఆకలిని కూడా ఈ మందు నియంత్రిస్తోందట. ఈ మందు వాడి దాదాపు 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా వల్ల వర్క్ ప్రం హోం నేపథ్యంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ ఔషధం మరింతగా అందుబాటులోకి వస్తే ఊబకాయులు హాయిగా తిరిగేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.