1996లో విడుదలైన ‘ఇండియన్’ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో అప్పటి సినిమా ప్రియులకు బాగా తెలుసు. సౌత్ ఇండియాలో అప్పటికి ఉన్న కలెక్షన్ల రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. శంకరే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. కమల్ హాసనే కథానాయకుడు.
ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా భారీ బడ్జెట్లో, అధునాతన టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు శంకర్. ఈ సినిమా సక్సెస్ మీద టీం అంతా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ చిత్రానికి ఆశాజనకమైన పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సినిమా విపరీతంగా ఆలస్యం కావడం వల్లో.. ప్రోమోలేవీ ఎగ్జైటింగ్లో లేకపోవడం వల్లో.. ఇంకే కారణాల వల్లో కానీ.. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆశించిన బజ్ అయితే క్రియేట్ కాలేదు.
దీంతో ‘ఇండియన్-2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన నిర్మాతల్లో, బయ్యర్లలో ఉంది. అందుకు తగ్గట్లే ‘ఇండియన్-2’ బుకింగ్స్ డల్లుగా మొదలయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన మార్కెట్ అయిన తమిళనాడులోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతమాత్రం ఆశాజనకంగా లేవు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి బుకింగ్స్ ఓపెన్ చేస్తే పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోవాలి. కానీ బుకింగ్స్ మొదలైన ఒక రోజు తర్వాత చూస్తే ఓవరాల్‌గా తమిళనాడులో బుకింగ్స్ పర్సంటేజ్ 25 శాతానికి మించలేదు.
హౌస్ ఫుల్ అయిన షోలే కనిపించడం లేదు. తమిళనాడులోనే ఈ పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. సినిమా విడుదలకు రెండు రోజులే సమయం ఉన్నా ఇంకా బుకింగ్సే మొదలుకాలేదు. ఇక్కడ కూడా రెస్పాన్స్ ఇంతకంటే గొప్పగా ఉంటుందన్న అంచనాలు కనిపించడం లేదు. చూస్తుంటే ‘ఇండియన్-2’ ఓపెనింగ్స్ మీద మరీ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేనట్లే ఉంది. టాక్‌ను బట్టే సినిమా పుంజుకోవడం ఆధారపడి ఉంటుందన్నమాట.