జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఉన్న ట్రయల్ కోర్టుల్లో ఉన్న 11 కేసులతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు లేవనో, ట్రయల్ కోర్టులు అంగీకరించాయన్న కారణంతోనో, డీజీపీ నివేదికలు ఇచ్చారన్న కారణంతోనో ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటూ గతంలోనే జీవోలు జారీ చేసింది.
అయితే, ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్ని హైకోర్టు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టులు ఎత్తేయడం చెల్లదంటూ గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, హైకోర్టు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టుల ద్వారా జగన్ సర్కార్ ఉపసంహరించిన కేసులు మళ్లీ తిరగదోడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, గతంలోనే ఈ వ్యవహారంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆ జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఉదయభాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, 3 వారాల్లోపు ఈ కేసులో కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.