టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సినిమా సీజన్ అయిన సంక్రాంతి కోసం చాలా ముందు నుంచే రేసు మొదలవుతుంది. ఆరు నెలల ముందే అనౌన్స్మెంట్లు వచ్చేస్తాయి. వస్తామో రామో.. ముందు కర్చీఫ్ అయితే వేసేద్దాం అన్నట్లుగా రిలీజ్ డేట్లు ప్రకటించేస్తుంటారు. కానీ సమయం దగ్గర పడేకొద్దీ పరిస్థితులు మారిపోతుంటాయి. ఒక సినిమా రేసు నుంచి తప్పుకుంటుంది. కొత్తగా ఇంకోటి వస్తుంది.
2025 సంక్రాంతికి ముందుగా బెర్తు కన్ఫమ్ చేసుకున్న సినిమా.. విశ్వంభర. కానీ ఇప్పుడు ఆ చిత్రం వేసవికి వాయిదా పడిపోయింది. ఈ ఏడాది దసరా లేదా క్రిస్మస్కు అనుకున్న ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి బరిలో నిలిచింది. బాలకృష్ణ-బాబీ సినిమాను కూడా ముందు దసరాకే అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ చిత్రం కూడా సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. ‘తండేల్’ మూవీని క్రిస్మస్కు అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు.
ఇక ‘విశ్వంభర’ లాగే సంక్రాంతికి అనుకున్న మరో చిత్రం కూడా రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే.. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి చిత్రం. ‘సంక్రాంతికి కలుద్దాం’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం చిత్రీకరణలో టీం కొంచెం వెనుకబడిందని.. డెడ్ లైన్ అందుకోవడం కష్టమని భావిస్తున్నారని సమాచారం. సినిమా మొదలైన తర్వాత ఏ ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకుండా సైలెంట్‌గా షూట్ చేసుకుంటున్నప్పటికీ సినిమాను సంక్రాంతికి రెడీ చేయడం కష్టమని అనుకుంటున్నారట.
పైగా నాగచైతన్య మూవీ ‘తండేల్’ను సంక్రాంతికి వాయిదా వేయాలని చూస్తున్న నేపథ్యంలో తన మేనల్లుడితో పోటీ ఎందుకని వెంకీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘తండేల్’ సంక్రాంతికి రాని పక్షంలో, వెంకీ మూవీ ఆ సమయానికి రెడీ అవుతుందనే కాన్ఫిడెన్స్ వస్తేనే ఆ చిత్రాన్ని అప్పుడు రిలీజ్ చేస్తారని.. లేదంటే వేసవికి వాయిదా వేస్తారని తెలుస్తోంది.