వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా 20 మందికి పైగా కొత్త అభ్యర్థులు ఎంపీలుగా పోటీలో ఉండనున్నారు. మామూలుగా ఏపీలో గత పది ఏళ్లలో జరిగిన రాజకీయ అంశాలు పోల్చి చూసుకుంటే ఎంపీలుగా పోటీ చేసేందుకు ఈసారి చాలామంది ఆసక్తి చూపరనే అనుకున్నారు. గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో.. ఇప్పుడు ఐదేళ్ల వైసిపి పాలనలో ఒకరిద్దరు మినహా ఎంపీలు ఎవరు తమదైన ముద్ర వేయలేకపోయారు. అయితే ఈ సారి తెలుగుదేశం నుంచి ఎంపీలుగా పోటీ చేసేందుకు పలువురు యువ పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, బడాబడా నేతలు ఒక్క సారిగా రేసులోకి దూసుకు వచ్చేశారు.
చంద్రబాబు ఈసారి సామాజిక సమీకరణలను పక్కాగా బేరీజు వేసుకుని ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏలూరు లోక్‌సభ సీటును ఈసారి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గోరుముచ్చు గోపాల్ యాదవ్ కు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు గోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ 2009లో ఒంగోలు సీటును యాదవ కమ్యూనిటికే చెందిన కొండయ్య యాదవ్ ( ప్రస్తుత చీరాల ఇన్చార్జ్)కు ఇచ్చింది. ఇక 2014 ఎన్నికల్లో నెల్లూరు సీటును బీద మస్తాన్‌రావు ( ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు)కు ఇచ్చారు. ఇక యాదవ సామాజిక వర్గం నుంచి నరసారావుపేట లోక్‌సభకు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ పోటీ చేయాలని ఉత్సుకత చూపారు. ఆరు నెలల పాటు అక్కడ పరిచయాలు కూడా పెంచుకున్నారు.
అయితే అదే కుటుంబం నుంచి మైదుకూరులో సుధాకర్ యాదవ్‌తో పాటు అటు ఆయన బంధువు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని సీటు ఇవ్వడంతో సుధాకర్ యాదవ్‌కు అధిష్టానం ఆగిపొమ్మని చెప్పిన మాట వాస్తవం. ఇదే టైంలో గోరుముచ్చు గోపాల్ యాదవ్ అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. చిన్న వయస్సులోనే పారిశ్రామికవేత్తగా విజయవంతమై…సేవా కార్యక్రమాలతో దూసుకుపోతోన్న గోపాల్ యాదవ్‌కు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లు ఓసీ వర్గాలకు ఇవ్వడం ఖరారు కావడంతో ఏలూరు ఎంపీ టిక్కెట్ బీసీలకు ఇవ్వాలని అధిష్టానం చేస్తోన్న ఆలోచనే గోరుముచ్చుకు ప్లస్ కానుంది. ఇక ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యాదవ సామాజిక వర్గం ఓటర్లు 25 – 35 వేల వరకు ఉన్నారు. ముఖ్యంగా చింతలపూడి, దెందులూరు, నూజివీడు, పోలవరం నియోజకవర్గాల్లో వీరి ఓట్లు చాలా ఎక్కువ. మొత్తంగా 2.5 లక్షలకు పైగా ఓటర్లు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నారు.