టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా వైసీపీలో చేరతారన్న ప్రచారం జరగడం…దానిని గంటా ఖండించడం జరుగుతోంది. అలా అని గంటా టీడీపీ కార్యక్రమాల్లోగానీ, వాడీవేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గానీ, వైసీపీతో వాడీవేడీగా జరుగుతున్న మాటల యుద్ధంలో గానీ వేలు పెట్టలేదు.
మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు పలువురు విశాఖ వైసీపీ నేతలు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే వైసీపీలో గంటా చేరిక ఆలస్యమవుతోందని టాక్. ఈ విషయం టీడీపీ నేతలకూ తెలియడంతో అటు టీడీపీలో ఇమడలేకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నది మరో కారణం అని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటికరణ అంశం తెరపైకి రావడంతో సందట్లో సడేమియా అంటూ తన పదవికి గంటా రాజీనామా చేశారని అంటున్నారు.
ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం సీఎం జగన్ పై గంటా చేసిన వ్యాఖ్యలు ఆయన వైసీపీలో చేరడం లేదనే హింట్ ఇచ్చేలా ఉన్నాయి. బలవంతుడిగా కనిపించినా…జగన్ ఓ బలహీన నాయకుడు అని గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుతో అది స్పష్టమైందని, మంత్రి పదవులు ఇవ్వలేదని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం తన పాతికేళ్ల రాజకీయ చరిత్రలో ఇదే మొదలని గంటా షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో, మొన్నటి వరకు ఫ్యాన్ గాలి కింద సేద తీరుతూ వైసీపీ కండువా కప్పుకోవాలని తహతహలాడిన గంటా…సడెన్ గా యూ టర్న్ తీసుకొని సైకిల్ ఎక్కేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వైసీపీలో గంటా చేరబోతున్నారని, డిసెంబర్ 1 తర్వాత నిర్ణయం ప్రకటించబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో భేటీ సందర్భంగా గంటా వైసీపీలో చేరడంపై చర్చించారని తెలుస్తోంది. డిసెంబర్ తొలి వారంలో విశాఖలో జరగబోయే జగన్ సభలో గంటా వైసీపీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి, ఈ సారైనా ఈ పుకారు నిజమో…లేక గాలివార్తో తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.