ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే, కొన్ని చోట్ల ఇసుక ఉచితంగా దొరకడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇసుక విషయంలో పార్టీ నేతలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇసుక తవ్వకాలు, రవాణాపై చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గనుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబబు..ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, అదనపు చార్జీలు తీసుకోవద్దని మరోసారి చెప్పారు. ఇసుక తవ్వకాలు, రవాణాను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక దొరకడం లేదని ఏ ఒక్కరూ అనకూడదని స్పష్టం చేశఆరు. వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఫోన్లు చేసే ఐవీఆర్ఎస్ను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్)తో అనుసంధానించాలని చంద్రబాబు ఆదేశించారు.
డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి తేవాలని, ఇసుక రవాణా ఖర్చులు మరింత తగ్గించేలా చూడాలని సూచించారు. వ్యక్తిగత వినియోగానికి ఇసుక కావాలన్న వారికి ఏ ఆంక్షలు పెట్టొద్దని, జాప్యం లేకుండా ఇసుక ఇవ్వాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించకుండా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.