2022 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హై ఓల్డేజ్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేపిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ చివరి బంతి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. ఇప్పటివరకు జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ లలో ఇది అత్యుత్తమమైనదంటే అతిశయోక్తి కాదు. మ్యాచ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ తీవ్ర ఉత్కంఠను మిగిల్చిన ఈ మ్యాచ్ లో బై రన్స్ పై రచ్చ జరిగినప్పటికీ భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
ప్రపంచలోని మేటి క్రికెటర్లలో ఒఖరై విరాట్ కోహ్లీ మరోసారి తానెందుకు ఆ క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడో చాటి చెప్పేలా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కడవరకు క్రీజులో నిలబడి తీవ్రమైన ఒత్తిడిని అవలీలగా ఎదుర్కొని తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, ఈ మ్యార్ లో డ్రామా అంతా చివరి ఓవర్లో జరిగింది. పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ వేసిన చివరి ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ సిక్సర్ గా మలిచాడు.
కానీ, ఆ బంతి నడుము(వెయిస్ట్) కంటే ఎత్తుగా రావడంతో దానిని అంపైర్ నోబాల్ గా ప్రకటించారు. కోహ్లీ కూడా నోబాల్ అన్న రీతిలో అంపైర్ల వైపు చూడడం, అంపైర్లు కూడా దానిని నోబాల్ గా ప్రకటించడం జరిగిపోయాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆ నోబాల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. కానీ, పాక్ ఆటగాళ్లు మాత్రం అది నోబాల్ కాదని గ్రౌండ్‌లోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ బంతికి ఫ్రీ హిట్ రావడం…ఫ్రీ హిట్ బాల్ కు కోహ్లీ బౌల్డ్ అయి..బై రూపంలో మూడు పరుగులు రావడం మరో మలుపు.
దీంతో, ఈ నోబాల్ పై, ఆ బై రన్స్ పై పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘అంపైర్ భయ్యో… మీ ఆలోచనలకు నమస్కారం.. ఈ రాత్రికి మీకు భోజనం పక్కా’’ అని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ బై వివాదంపై ప్రముఖ రిటైర్డ్ అంపైర్ సైమన్ టౌఫెల్ స్పందించాడు. ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ అంపైర్లలో ఒకడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన టౌఫెల్ ఈ వివాదంపై క్లారిటీనిచ్చారు. అంపైర్లు చేసింది నూటికి నూరుపాళ్లూ కరెక్టే అని తేల్చి చెప్పాడు.
“ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ రేపిన క్లైమ్యాక్స్ తర్వాత నన్ను ఎంతో మంది విరాట్ కోహ్లి క్లీన్‌బౌల్డ్ అయిన తర్వాత కూడా బైస్ తీయడంపై అడిగారు. అయితే బంతి స్టంప్స్‌ను తగిలి వెళ్లిన తర్వాత బ్యాటర్లు పరుగులు తీయడాన్ని అంపైర్ బైస్‌గా ప్రకటించి సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రీహిట్‌కు స్ట్రైకర్‌ను ఔట్‌గా ప్రకటించలేం. అందువల్ల బాల్ స్టంప్స్‌ను తగిలి వెళ్లినా అది డెడ్ అయినట్లు కాదు. బంతి ఇంకా ఆటలో ఉన్నట్లే. ఆ లెక్కన బైస్‌గా ప్రకటించే నిబంధనలను ఇది సంతృప్తి పరిచింది” అని టౌఫెల్ ట్వీట్ చేశాడు.