సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ .. వీరతాడు వేశారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా(ప్రతిపక్ష) బొత్సను నియమించారు. దీనిని ఎవరూ ఊహించలేదు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇటీవల విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి సభ్యుడిగా బరిలోకి దిగిన బొత్స.. ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇక్కడ కూడా బొత్సను ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే.. ఉత్తరాంధ్రలో చాలా మంది నాయకులు ఉన్నారు. వారిని కాదని.. బొత్సను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక, ఎన్నికల్లో పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించినా.. కూటమి సర్కారుకు సాధ్యం కాలేదు. ఏకంగా 200 మంది వైసీపీ నాయకులను తమవైపు తిప్పుకొంటే తప్ప.. గెలుపు గుర్రం ఎక్కలేమని భావించి టీడీపీ.. కొన్ని రోజులు ప్రయత్నించి.. తర్వాత వెనుకడుగు వేసింది. నిజానికి ఈ సీటు కూడా వైసీపీదే. గతంలో వంశీకృష్ణ యాదవ్కు ఇక్కడ నుంచే మండలికి అవకాశం కల్పించింది. అయితే.. ఈయన అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో వివాదానికి దిగి.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. అదే ఎంవీవీని ఓడించారు.
దీంతో శాసన మండలి సీటు ఖాళీ అయింది. దీనికి ఎంతో మంది నాయకులు పోటీ పడినా.. చివరకు జగన్.. బొత్స సత్యనారా యణ వైపు మొగ్గు చూపించారు. మంగళవారం శాసన మండలి సభ్యుడిగా బొత్స ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం.. ఉత్తరాంధ్రకు చెందిన నాయకులతో కలిసి ఆయన మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్ను కలుసుకున్నారు. ఆ తర్వాత.. కొద్ది సేపటికే.. జగన్ మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్సను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కేబినెట్ ర్యాంకుతో కూడిన గౌరవం, ప్రొటోకాల్ లభిస్తుంది.
అయితే.. ఇప్పటి వరకు వైసీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి.. మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి లేళ్లను పక్కకు తప్పించి.. బొత్సకు పట్టం కట్టడం వెనుక.. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ సాగుతోంది. అంతేకాదు.. తూర్పు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్సకు అవకాశం ఇవ్వడం ద్వారా మరోసారి పుంజుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి బొత్స నియామకంతో మండలిలో వైసీపీకి బలమైన నాయకుడు లభించారనే చెప్పాలి.