పుతిన్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. రష్యా అధ్యక్షడిగా కంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పక్కా నియంతగా ఆయన సాగిస్తున్న దూకుడు చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తాజా రష్యా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణం వెనుక కూడా పుతిన్ పేరు జోరుగా వినిపిస్తోంది. ఇంతటి వివాదాస్పద నాయకుడు రష్యా చరిత్రలో లేరని అంటారు. అయితే.. ఇప్పుడు ఇంత బిజీలోనూ.. ఇంత ఉత్కంఠలోనూ.. పుతిన్ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. తలలు బోడులైనా.. తలపులు బోడులవునా.. అన్నట్టుగా పుతిన్ ఇప్పుడు ప్రేమలో పడ్డారు. ఓ యువతిని చాలా గాఢంగా ఆయన ప్రేమిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం పుతిన్ వయసు 71 సంవత్సరాలు. ఆయన ప్రేమించిన ఏకాథరీన్ వయసు 39 ఏళ్లు. అంటే.. ఇద్దరి మధ్య దాదాపు 31 ఏళ్ల వయసు తేడా ఉంది. అయితే.. ఇదేమీ.. వన్ సైడ్ లవ్ కాదని అంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె కూడా.. పుతిన్‌పై మనసు పారేసుకుందట. వినేందుకు కొంత ఎబ్బెట్టుగానే అనిపించినా.. నిజమేనని చెబుతున్నారు. ఫిజిక్ పరంగా పుతిన్ చాలా ఫిట్‌గా ఉంటారు. ఆయన రోజూ.. 4 గంటలు నిర్విరామంగా వ్యాయామం చేస్తారు. అంతేకాదు.. ఈత కొట్టడం.. జంపింగ్ చేయడం ఆయన హాబీలు. దీంతో వయసు 71 అయినా.. `40 +`గానే కనిపిస్తారు. 39 ఏళ్ల ఎకాథరీనా మిజులినాతో పుతిన్ గత రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు రష్యాలో చర్చగా మారింది.
ఎవరీ అందగత్తె?!
పుతిన్‌ను ప్రేమించిన ఏకాథరీనా.. ఎవరో కాదు.. పుతిన్‌ను అన్ని విషయాల్లోనూ సమర్థించే మాజీ సెనెటర్(ఎంపీ) ఎలెనా మిజులినా కుమార్తె. ఈమె ప్రస్తుతం క్రెమ్లిన్‌కు మద్దతుగా ఉండే ‘సేఫ్ ఇంటర్నెట్ లీగ్’కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు పుతిన్‌పై వచ్చే విమర్శలను తొలగించడం, లేదా ఖండించడం వంటివి ఆమె చేస్తున్నారు. ఈమెతో పుతిన్ ఉక్రెయిన్ యుద్ధ సమయం నుంచి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక, పుతిన్ ప్రేమాయణం నిజమేనంటూ ఉక్రెయిన్ మీడియా కూడా చెబుతోంది. టెలిగ్రామ్ ఛానళ్లలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వివాహం-విడాకులు..
రష్యా అధినేత పుతిన్‌కు ఎప్పుడో వివాహం కావడం.. అది విడాకులు కావడం కూడా అయిపోయింది. 2014లో పుతిన్ తన భార్య లియుడ్మిలా కు విడాకులు ఇచ్చారు. తర్వాత ఒలిపింక్స్ గోల్డ్ మెడలిస్ట్ `అలీనా కబయేవా`తో ప్రేమాయణం నడిపి.. సహజీవనం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే.. తలలు బోడులైనా.. తలపులు బోడులవునా.. అన్నట్టుగా పుతిన్ ఇప్పుడు ప్రేమలో పడ్డారు.