సాధారణంగా మన ప్రాంతంలో ఉండే కీలకమైన సంస్థలు, కనీసం వాటి పేర్లు సాధారణ పౌరులలో చాలామందికి గుర్తుంటాయి. ఇక, రాజకీయ నాయకులకైతే కచ్చితంగా గుర్తుంటాయి. అందులోనూ, ఆ ప్రాంతానికి చెందిన చదువుకున్న వ్యక్తి…అందులోనూ డాక్టర్…ఆ పై మంత్రి…ఇన్ని క్రెడెన్షియల్స్ ఉన్న వ్యక్తికైతే తప్పకుండా గుర్తుండి తీరాలి. కానీ, వీటన్నింటికీ, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అతీతం.
ఆయన ప్రాంతంలో ఉన్న ప్రముఖ డెయిరీ పేరు గుర్తులేని సీదిరి అప్పలరాజు…గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీని మాత్రం ప్రభుత్వపరం చేస్తానని కంకణం కట్టుకొని మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తావిస్తూ సీదిరి అప్పలరాజును ఏకిపారేశారు. అధికారం ఉంది కదా అని అప్పలరాజు సంగం డెయిరీ మెడపై కత్తిపెట్టి లాక్కోవచ్చనుకుంటున్నాడని, ఆయనే కాదు… ఆయన తాతలు దిగివచ్చినా సంగం డెయిరీని లాక్కోలేరని ధూళిపాళ్ల కౌంటర్ ఇచ్చారు.
సంగం డెయిరీని కాపాడుకునే సత్తా, సమర్థత పాడి రైతులకు ఉన్నాయని అన్నారు. ఇక, అప్పలరాజు భాష, ప్రవర్తన చూస్తే, పశువులు కూడా ఆయన్ని తన్నేలా ఉన్నాయంటూ ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పలరాజు అవినీతి బాగోతంపై నక్సలైట్లు రెండు లేఖలు రాశారని, కమీషన్ల కోసం పశువుల దాణాకు టెండర్ ను ఫర్టైల్ గ్రీన్ అనే సంస్థకు కట్టబెట్టిందెవరు మంత్రివర్యా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పశువుల దాణా సరఫరా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన వల్లభ ఫీడ్స్ కు అప్పగించింది నిజం కాదా? అని నిలదీశారు.
పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారి ఆస్తుల్ని, సంస్థల్ని లాక్కుంటున్న జగన్ రెడ్డి, అమూల్ సంస్థ కోసమే రాష్ట్ర సహకార డెయిరీలను కబళిస్తున్నాడని ఆరోపించారు. జగన్ పాలనలో పారిశ్రామిక రంగంపై విష సంస్కృతి మొదలైందని విమర్శించారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో అమూల్ కు పాలుసేకరించే సత్తా, దమ్ము అప్పలరాజుకి, జగన్ రెడ్డికి ఉన్నాయా? అని ప్రశ్నించారు. 4.50 లక్షల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్న శ్రీజ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి చెరబట్టినప్పుడు జగన్ రెడ్డి ఏంచేశాడని ధూళిపాళ్ల నిలదీశారు.