ప్రముఖ నటుల మూవీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మిగిలిన హీరోలతో పోలిస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన నటిస్తున్న ఓజీ మీద ఉన్న అంచనాలు అన్నిఇన్ని కావు. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కారణంగా ఆ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఓజీ పోస్టర్ చూపించి.. బుట్టలో వేసుకున్న ఒక మోసగాడు ఒకరి నుంచి భారీగా వసూలు చేసిన వైనం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే.
ప్రముఖ నటుల సినిమా ప్రమోషన్ వ్యాపారం పేరుతో మోసం చేసిన అతను.. ఓజీ 2025 పోస్టర్ ను చూపించటం ద్వారా మోసానికి తెర తీశాడు. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఛత్రినాకకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి తన మిత్రులతో కలిసి తరచూ గోవాకు వెళ్లి వస్తుంటాడు. గత ఏడాది అక్టోబరులో బిగ్ డాడీ క్యాసినోకు వెళ్లిన వేళలో శ్రీలంకకు చెందిన ఉదయ్ రాజ్.. వివేక్ లు పరిచయమయ్యారు.
టాలీవుడ్ అగ్రహీరోల సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తుంటామని నమ్మించాడు. ఆ తర్వాత అదే నెలలో ఉదయ్ రాజ్ గచ్చిబౌలిలోని ఒక హోటల్ కు వచ్చాడు. ఈ సందర్భంగా బాధితుడ్ని కలిశాడు. తాము కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమా ప్రమోషన్లు చేసేందుకు అవకాశాలు వచ్చినట్లుగా చెప్పాడు. త్వరలో విడుదల కానున్న ఓజీ చిత్రానికి కూడా ఛాన్సు లభించినట్లుగా చెప్పి.. ఓజీ 2025 సినిమా డైరెక్టర్ సుజిత్ ఫొటో చూపించాడు. దీంతో.. అతడి మాటల్ని నమ్మాడు.
ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబరు 12న ఉదయ్ రాజ్.. వివేక్ లు బాధితుడ్ని వాట్సాప్ ద్వారా సంప్రదించి.. అమరన్ సినిమా ప్రమోషన్ కు రూ.20 లక్షలు ఇస్తే వారంలో రెట్టింపు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అతడి మాటల్ని నమ్మి పెట్టుబడి పెట్టాడు. అందకు తగ్గట్లే అమరన్ మూవీలో లాభాలు వచ్చాయమంటూ వారిద్దరు తమ ఖాతాల్లో నుంచి రూ.25 లక్షలు జమ చేయటంతో బాధితుడు వారిని పూర్తిగా నమ్మేశాడు.
ఆ తర్వాత యూఐ.. కంగువా.. పుష్ప.. గేమ్ ఛేంజర్ సినిమాలకు పెట్టుబడి పేరుతో ఆన్ లైన్ లో రూ.76 లక్షలు.. విడతల వారీగా రూ.58 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బు కోసం బాధితుడు ఉప్పుగూడలో ఉన్న ఇంటిని అమ్మేశాడు. ఇంట్లో నగల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ రూ.1.34 కోట్లు వారికి ఇచ్చాడు.ఆ తర్వాత నుంచి అసలు.. లాభం ఏమీ ఇవ్వకుండా ముఖం చాటేశారు. ఎన్నిసార్లు వారిని సంప్రదించినా ఫలితం లేకపోవటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించి.. పోలీసుల్నిఆశ్రయించారు. దీంతో సీసీ ఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.