వైఎస్ వివేకా హత్య వ్యవహారంపై అధికార వైసీపీని ప్రతిపక్ష పార్టీలు ఇరుకున పెడుతున్న సంగతి తెలిసిందే. సొంత బాబాయి మర్డర్ జరిగి ఐదేళ్లు కావస్తున్నా నిందితులకు శిక్ష పడలేదని, వివేకాను చంపించిన వారికి జగన్ అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు వ్యవహారం ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ నేతలను ఇరుకున పెట్టేలా ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ ప్రచారం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశముందని తన పిటిషన్ లో్ పేర్కొన్నారు. దీంతో, ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను కడప న్యాయస్థానం ఆదేశించింది. ఎవరూ దీని గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ తీర్పులో జగన్ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో, వివేకా కేసు గురించి జగన్ మాట్లాడొచ్చా? చంద్రబాబు మిగతావాళ్లు మాట్లాడకూడదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.