ప్రపంచాన్ని తన గుప్పటి పట్టి అల్లాడిపోయేలా చేసి.. చివరకు లక్షల మంది ఉసురు తీసిన కరోనాపై చైనాకు చెందిన శాస్త్రవేత్త చోవోషావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను జీవాయుధమని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ఇదే విషయాన్ని పలు దేశాల శాస్త్రవేత్తలు గతంలోనే చెప్పారు. కానీ, చైనా సహా .. దానికి మద్దతుగా ఉన్న కొన్ని దేశాలు ఖండించాయి. అంతేకాదు.. అసలు ఇప్పటి వరకు కరోనా ఎక్కడ పుట్టిందనే దానిపై ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి.
అయితే.. తాజాగా చోవోషావ్ స్పందిస్తూ.. కరోనా జీవాయుధమేనని.. చైనానే ఉద్దేశ పూర్వకంగా దీనిని తయారు చేసిందని.. ఆయన చెప్పారు. దీనికి ప్రధానంగా రెండుకారణాలు ఉన్నాయని ఆయన చెప్పడం మరింత సంచలనంగా మారింది. చైనా జనాభాను తగ్గించేందుకే దీనిని తయారు చేశారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చోవోషావ్.. చైనాలోని వుహాన్(కరోనా పుట్టిన ప్రాంతంగా చెబుతారు. ఇక్కడే తొలికేసు నమోదైంది) ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోఆయన మాట్లాడారు. కరోనా వైరస్ను జీవాయుధంలా వాడుకునేలా చైనా మార్పులు చేసిందని చోవోషావ్ వెల్లడించారు. మొత్తం నాలుగు రకాల వైరస్లను తమ సహచరులకు ఇచ్చి.. ఏది వేగంగా ఎక్కువ జాతులకు వ్యాపిస్తుందో గుర్తించాలని ఆదేశించారని తెలిపారు. అంతేకాకుండా.. సులువుగా దీనిని వేరే వ్యక్తులు, జాతులకు సోకేలా చేసేందుకు ఉన్న మార్గాలను కనుగొనాలని పేర్కొన్నట్టు చెప్పారు.
2019లో వుహాన్లో ప్రపంచ స్థాయి సైనిక క్రీడలు జరిగిన సమయంలో తమ సహచరులు చాలామంది అదృశ్యమయ్యారని ఆయన వివరించారు. వారందరినీ సైనిక క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో పరిశుభ్రతను పరిశీలించేందుకు పంపినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఆ క్రీడాకారులున్న చోట వైరస్ను వ్యాప్తి చేసేందుకే వారిని పంపినట్లు తెలిసిందని చెప్పారు. ఇదిలావుంటే.. కరోనాతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా మృతి చెంది ఉంటారని అనధికార అంచనా. అధికారికంగా కోటి మంది చనిపోయారు.