అంతగా పేరు లేని నటీనటులు, టెక్నీషియన్లు కలిసి తక్కువ బడ్జెట్లో ఓ సినిమా తీసి.. దాన్ని సవ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోవడం అంటే అంత తేలిక కాదు. గత కొన్నేళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి దయనీయంగా తయారైంది.
సినిమా పూర్తి చేయడం ఒకెత్తయితే.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం.. థియేటర్లు దక్కించుకుని సినిమాను సరిగ్గా రిలీజ్ చేసుకోవడం మరో ఎత్తు. ఇది సాధ్యం కాక ఏటా పదుల సంఖ్యలో చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. మరెన్నో సినిమాలు విడుదలకే నోచుకోకుండా ఆగిపోతున్నాయి.
కరోనా పుణ్యమా అని ఇప్పుడు చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాటి భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. సెకండ్ వేవ్ పుణ్యమా అని చాన్నాళ్ల పాటు థియేటర్లలో చిన్న సినిమాలకు స్థానమే లేని పరిస్థితి తలెత్తబోతోంది.
ఇండియాలో అత్యధికంగా చిత్రాలు తెరకెక్కే పరిశ్రమ ఏదంటే గతంలో బాలీవుడ్‌ను చూపించేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో టాలీవుడ్.. బాలీవుడ్‌ను వెనక్కి నెట్టి అత్యధిక చిత్రాలను రిలీజ్ చేసే ఇండస్ట్రీగా మారింది.
ఏటా తెలుగులో దాదాపు 200 సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇవి కాక ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని, విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమాలు ఎన్నో. గతంతో పోలిస్తే సినిమాల సంఖ్య బాగా ఎక్కువైపోయింది తెలుగులో. డిజిటల్ మేకింగ్ కారణంగా సినిమాలు తీసే వారి సంఖ్య బాగా పెరిగింది.
సినిమాల మీద మోజుతో పెట్టుబడి పెట్టేవాళ్లూ పెరిగారు. దీంతో ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తయారైపోతున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో బోలెడంత మంది ఫిలిం మేకర్లు తయారయ్యారు. అంతా కలిసి పెద్ద ఎత్తున సినిమాలు తీసేస్తున్నారు. కానీ వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి ఎన్ని.. థియేటర్లలో రిలీజవుతున్నవి ఎన్ని.. అందులో మంచి ఫలితాన్నందుకుంటున్నవి ఎన్ని అంటే.. సమాధానాలు చెప్పడం కష్టం.
ఒకప్పటితో పోలిస్తే మీడియం, పెద్ద రేంజ్ సినిమాల సంఖ్య పెరిగిపోయింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డ సమయాన్ని పక్కన పెడితే.. ప్రతి వారం కాస్త పేరున్న సినిమా ఒక్కటైనా రిలీజవుతున్న నేపథ్యంలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం కష్టమైపోతోంది.
చాలా వరకు చిన్న సినిమాలు నామమాత్రంగానే రిలీజవుతున్నాయి. ఏడాదిలో మూణ్నాలుగు మినహాయిస్తే చిన్న సినిమాలు ఆశించిన ఫలితాన్నందుకోవడం లేదు. ‘పెళ్ళిచూపులు’, ‘క్షణం’, ‘అర్జున్ రెడ్డి’, ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమాలకు జరిగిన మ్యాజిక్స్ అన్ని చిత్రాలకూ జరగవు. అలాంటి చిత్రాలు ఏడాదికి ఒకటో రెండో మాత్రమే వస్తుంటాయి.
మిగతా సినిమాల్లో చాలా వరకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే. థియేటర్లలో చిన్న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు రావడం క్రమ క్రమంగా తగ్గిపోతోంది. మీడియం రేంజ్ సినిమాలకే ఎంతో ఆలోచించి థియేటర్లకు వస్తన్న ప్రేక్షకులు.. చిన్న సినిమాల పట్ల రాను రానూ అనాసక్తి కనబరుస్తున్నారు. సినిమాల సంఖ్య బాగా పెరిగిపోవడం, ఓటీటీల్లో బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండటం ఇందుకు కారణం కావచ్చు.
భారీ వెయిటింగ్ లిస్ట్
మామూలుగానే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. పైగా కరోనా పుణ్యమా అని చిన్న సినిమాలకు మరింత గడ్డు పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఫస్ట్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడ్డాక బోలెడన్ని సినిమాలు పెండిరగ్లో పడిపోయాయి.
మళ్లీ షూటింగ్‌లు మొదలయ్యాక పూర్తయిన సినిమాలు కూడా తోడై.. విడుదలకు సిద్ధమైన చిత్రాల జాబితా ఇంకా పెద్దదైంది. థియేటర్లు పున:ప్రారంభమై నడిచిన మూణ్నాలుగు నెలల్లో ఒక 30 సినిమాల దాకా ప్రేక్షకులను పలకరించాయి. తర్వాత మళ్లీ వెండితెరలకు గ్రహణం పట్టింది.
మళ్లీ థియేటర్లు తెరుచుకునే సమయానికి విడుదలకు సిద్ధమయ్యే సినిమాల సంఖ్య ఇంకా పెరగబోతోంది. వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దదవబోతోంది. పెద్ద, మీడియం రేంజ్ సినిమాలకే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది. వివిధ దశల్లో ఉన్న ఒక స్థాయి చిత్రాలన్నింటినీ షెడ్యూల్ చేసుకుంటూ వెళ్తే చిన్న సినిమాలకు అసలు స్కోపే ఉండదు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు.. చిన్న సినిమాలు ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మంచిదని సూటిగా చెప్పేశాడు. అంటే థియేట్రికల్ రిలీజ్ గురించి ఆలోచించకుండా ఓటీటీల బాట పడితే మంచిదన్నది అతడి అభిప్రాయం.
అక్కడా అంత వీజీ కాదు
ఓటీటీలు చిన్న సినిమాలకు ఆశాదీపంలాగా కనిపిస్తున్న మాట వాస్తవం. గత కొన్నేళ్లలో వాటి హవా బాగా పెరిగింది. ముఖ్యంగా నిరుడు లాక్ డౌన్ మొదలయ్యాక ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. వీటి ద్వారా ఎన్నో కొత్త సినిమాలు నేరుగా రిలీజయ్యాయి.
ఐతే చిన్న సినిమాలను కొని రిలీజ్ చేసే విషయంలో వాటికీ కొన్ని నార్మ్స్ ఉంటాయి. తమను సంప్రదించిన ప్రతి సినిమానూ వాళ్లు కొనేసి రిలీజ్ చేసేయరు. గత ఏడాది కాలంలో ఓటీటీల్లో రిలీజైన సినిమాల్లో మంచి ఆదరణ దక్కించుకున్న సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గవే. కృష్ణ అండ్ హిజ్ లీల, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, మెయిల్, సినిమా బండి, ఏక్ మిని కథ లాంటి సినిమాలు మాత్రమే ఆకట్టుకున్నాయి.
ఈ మార్గంలో రిలీజైన పదుల సంఖ్యలో సినిమాలు నిరాశ పరిచాయి. కొన్ని సినిమాలపై వాటి స్థాయికి మించి పెట్టుబడులు పెట్టి దెబ్బ తిన్న ఓటీటీలు తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే సెకండ్ వేవ్-లాక్ డౌన్ టైంలో ఓటీటీల ద్వారా రిలీజైన సినిమాల సంఖ్య తగ్గిపోయింది.
ఓటీటీ రిలీజ్ కోసం సంప్రదిస్తున్న చిన్న సినిమాల మేకర్లకు ఆశించిన రేట్లు దక్కట్లేదు. అయినకాడికి అడుగుతుండటంతో వాళ్లు వెనుకంజ వేస్తున్నారు. మొత్తంగా చూస్తే చిన్న సినిమాల నిర్మాణం రాను రాను జూదంగా మారి, వాటి నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారవుతున్న మాట వాస్తవం.