తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా లెక్కలతో రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు దూకుడుగా విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో జరిగిన అటవీ విధ్వంసంఒయు లెక్కలతో ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరిత హారం కార్యక్రమం నుంచి అటవీ భూముల విక్రయం వరకు పెద్ద ఎత్తున చెట్లను నరికారని మండిపడుతోంది.
2015 నుండి 2022 వరకు అంటే ఏడేళ్ళలో హరిత హారం కార్యక్రమం కింద మొత్తం 219 కోట్ల మొక్కలను రాష్ట్రంలో నాటారు. దీని కోసం పలు శాఖల నుంచి 9,777 కోట్లు ఖర్చు చేసారు. గ్రామీణాభివృద్ధి శాఖ, 5,006.82 కోట్లు, అటవీ శాఖ 2,567.12 కోట్లు కేటాయించాయి. ఇక ఈ మొక్కలలో 85% బతికాయని సిఎం హోదాలో కేసీఆర్ స్వయంగా ప్రకటన కూడా చేసారు. అయితే ఇది పచ్చి అబద్దం అంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అటవీ విస్తీర్ణం నివేదికలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుందని కౌంటర్ ఇస్తోంది.
2014 నాటికి 21,591 చ.కి.మీ తెలంగాణాలో అటవీ విస్తీర్ణం కాగా.. 2021 నాటికి 21,213 చ.కి.మీకి తగ్గింది అని కాంగ్రెస్ లెక్కలు బయటపెడుతోంది. 2014 నుంచి 2024 మధ్యలో కెసిఆర్ సర్కార్ 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా.. అటవీయేతర ప్రయోజనాల కోసం కేటాయించగా.. పెద్ద ఎత్తున వృక్షాలను నరికారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలో 12,12,753 చెట్లను, 8 వేల ఎకరాల విస్తీర్ణంలో నరికి చదును చేసారు. చివరకు ఆ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. అలాగే వేల ఎకరాలను వేలం ద్వారా విక్రయించి 31 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అప్పటి ప్రభుత్వం అర్జించింది. మరి దీనికి సమాధానం ఉందా అంటూ కాంగ్రెస్ నిలదీస్తోంది.