ఏపీలో వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కి కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓవైపు రాజధాని, మరోవైపు పోలవరం పూర్తి చేసేందుకు నడుం బిగించారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో ఎన్నికల సమయంలో డ్యూటీ చేసిన ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రనకా పగలనకా కష్టపడి విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ సీఈవో ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు సర్కార్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాన్ని పొడిగించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్వోడీ కార్యాలయాల్లో వర్క్ చేసే ఉద్యోగులకు ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారు.