సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకుంటామని జగన్ ధీమాగా చెబుతున్నాడని, దమ్ముంటే పులివెందులలో జగన్ గెలిచి చూపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో బాబాయిని చంపడం గురించి చెప్పి ఓటెయ్యమని అడుగుతావా? కోడికత్తి పేరు చెప్పి ఓట్లు అడుగుతావా అని సెటైర్లు వేశారు.
బాబాయి హత్య జరిగితే గుండెపోటు అంటాడని, నారాసుర రక్తచరిత్ర అంటూ నేనే చంపానని ప్రచారం చేశారని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐనే బెదిరించే స్థాయికి జగన్ ఎదిగారని, ఆయనపై సీబీఐ 11 కేసులు పెట్టిందని గుర్తు చేశారు. సీబీఐ ఆ కేసుల బటన్ ను నొక్కితే ఈ జగన్ ఎక్కడుంటాడు? అని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లు వింటున్న పోలీసులున్నారని, వాళ్లు రెండ్రోజులు ఉంటారని, మూడోరోజున ఆ పోలీసులే జగన్ ను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు.
తన మీటింగులకు వచ్చిన వారిపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలు జైల్లో బాధపడుతుంటే పైశాచిక ఆనందంతో చూడ్డానికి కుప్పానికి జగన్ వస్తున్నాడని అన్నారు. ఏం పీకాడని జగన్ కుప్పం వస్తున్నాడని ప్రశ్నించారు. చిత్తూరు జైల్లో అకారణంగా అరెస్టైన కుప్పం టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ పై చండ్ర నిప్పులు చెరిగారు. జరిగిన ఘటనలపై ప్రశ్నించిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు పెట్టడంపై మండిపడ్డారు. మీరేం పోలీసులండీ… ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడతారా? అని ఫైర్ అయ్యారు. ఎస్సీల పైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.