సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పేరు కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ కుమార్ విమర్శలు గుప్పిస్తోన్న బ్రదర్ అనిల్…జగన్ పాలనపై క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సంతోషంగా లేరని ఆరోపణలు చేస్తున్నారు. ఆ కారణంతోనే ఆయా సంఘాల ప్రతినిధులతో తాను భేటీలు నిర్వహిస్తున్నానని బ్రదర్ అనిల్ చెబుతున్నారు.
ఏపీకి బీసీ సీఎం కావాలని ఏకంగా జగన్ సీఎం పదవికే బ్రదర్ అనిల్ ఎసరు పెట్టేలా కామెంట్లు చేశారు. దీంతో,బ్రదర్ అనిల్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రదర్ అనిల్ కు రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయ నాయకుడిగా అవతారమెత్తాలని బ్రదర్ అనిల్ కు ఉంటే…తెలంగాణలో రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక, ఏపీ రాజకీయాల్లో తలదూర్చవద్దు బ్రదర్ అంటూ అనిల్ కు ప్రవీణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బ్రదర్ అనిల్ ను అధికార పార్టీ నేతలు టార్గెట్ చేశారన్న టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రదర్ అనిల్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గుంటూరు జిల్లాలో ప్రముఖ క్రైస్తవ సంఘంగా కొనసాగుతున్న ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చి (ఏఈఎల్సీ)లో బ్రదర్ అనిల్ కుమార్ ప్రమేయం పెరిగిందంటూ ఆ సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రదర్ అనిల్ నుంచి సంస్థను కాపాడాలని ఏకంగా ఓ తీర్మానాన్నే ఆమోదించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. తెనాలిలో ఈ సంఘానికి చెందిన చర్చిలో సంఘం ప్రతినిధులు భేటీకాగా…అనిల్ కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు గళం విప్పారు. దీంతో, రెండు గ్రూపుల మధ్య రసాభాస జరిగింది. మరి, ఈ వ్యవహారంపై బ్రదర్ అనిల్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.