రోటీన్ కు భిన్నమైన షాకింగ్ ఉదంతం ఆగ్రాలో చోటు చేసుకుంది. ప్రేమ అంటూ వెంటపడటం.. ప్రేమించలేదని కసిగా యాసిడ్ దాడులకు దిగే దుర్మార్గాన్నిఇప్పటివరకు చూశాం. కానీ.. ప్రేమ పేరుతో కలిసి తిరిగి.. సహజీవనం చేసిన తర్వాత తూచ్ అంటూ.. హ్యాండిచ్చిన ప్రియుడి విషయంలో ఒక ప్రియురాలు వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ఆగ్రాకు చెందిన 28 ఏళ్ల దేవేంద్ర.. నిందితురాలు సోనమ్ ఇద్దరు ఒక ప్రైవేటు ల్యాబ్ లో పని చేస్తున్నారు. పరిచయం.. స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. తర్వాతి వారిద్దరూ ఒక అద్దె ఇంట్లో సహజీవనం షురూ చేశారు. ఈ క్రమంలో దేవేంద్రకు వారింట్లోని వారు ఒక సంబంధాన్ని ఖాయం చేసి పెళ్లి చేసుకోవాలన్నారు. ఇంట్లో వారి మాటకు దేవేంద్ర ఓకే చెప్పాడు.
దీంతో.. షాక్ తిన్న సోనమ్.. బాయ్ ఫ్రెండ్ ను నిలదీసింది. తన ఇంట్లో చూపించిన సంబంధాన్ని చేసుకోనున్నట్లు తేల్చి చెప్పాడు. దీంతో.. కసి పెంచుకున్న ఆమె సీలింగ్ ఫ్యాన్ రిపేర్ పేరుతో దేవేంద్రను ఇంటికి పిలిచింది. సమయం చూసుకొని ఒక్కసారిగా అతడిపై యాసిడ్ కుమ్మరించింది. దీంతో దేవేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలైన అతడు మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు.
ఈ ఉదంతంపై దేవేంద్ర తల్లిదండ్రులు సోనమ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమించినోడు ఎంత హ్యాండిస్తే మాత్రం.. అలా అడ్డంగా చంపేయటమేనా? అంటూ షాక్ తింటున్నారు.