నిజమే… అబద్దాలు చెప్పి బతికే పార్టీల్లో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు. అధికారం కోసం ఎంతకైనా బరితెగించేలా వ్యవహరిస్తున్న బీజేపీ… పుదుచ్చేరిలో పాలనా పగ్గాలు చేపట్టే దిశగా అమలుకు ఏమాత్రం నోచుకోని హామీలను గుప్పిస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని విపక్షంలో ఉండగా పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేసి… ఆ తర్వాత తాను అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ప్రకటన చేసిన బీజేపీ… ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే సమస్యే లేదని తేల్చి చెబుతున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే గనుక… చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయని, వాటన్నింటికీ ఇవ్వాల్సి వస్తుందని… ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కూడా బీజేపీ వాదిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చేసిన బీజేపీ… ఆ ప్యాకేజీని అమలు చేయడాన్ని కూడా అటకెక్కించిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా… ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా రాదన్న వాదనలు వినిపించాయి.
ఇలాంటి నేపథ్యంలో పుదుర్చేరి అసెంబ్లీకి ఎన్నికలు సమీపించిన తరుణంలో అక్కడి కాంగ్రెస్ సర్కారును నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన బీజేపీ… అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచేందుకు తనదైన శైలి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పుదచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదంటూ తేల్చి చెప్పేసిన తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోనే ఆ మేనిఫెస్టోను విడుదల చేయించింది. పుదుచ్చేరి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏమాత్రం తత్తరపాటు లేకుండా… తాము అధికారంలోకి వస్తే… పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని నిర్మలమ్మ ప్రకటించేశారు.
అంతేకాకుండా ప్రత్యేక హోదా ద్వారా జమ్మూ కాశ్మీర్ కు ఇచ్చినట్టుగా ప్రస్తుతం విడుదల చేస్తున్న కేంద్ర నిధులను 25 శాతం నుంచి 40 శాతానికి పెరగనున్నాయని కూడా ఊదరగొట్టేశారు. మరింత ముందుకు సాగిన నిర్మలమ్మ… పుదుచ్చేరి యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా ప్రకటించారు.
పుదచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోను చూస్తుంటే… నిజంగానే అవకాశవాద రాజకీయాల్లో బీజేపీది అందె వేసిన చెయ్యిగానే చెప్పాలి. ఓ వైపు ప్రత్యేక హోదాను ఏ ఒక్క రాష్ట్రానికి ఇవ్వవద్దని నీతి ఆయోగ్ చెప్పిందని నిత్యం చెబుతూ వస్తున్న బీజేపీ… మరి పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక హోదాను ఇస్తామని ఎలా చెబుతోందన్న ప్రశ్న తలెత్తుతోంది.
2014 ఎన్నికల సందర్భంగా తిరుపతి బహిరంగ సభలో నరేంద్ర మోదీ స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చేసిన బీజేపీ… ప్రత్యేక ప్యాకేజీని ముందు పెట్టి ప్రత్యేక హోదాను అటకెక్కించింది.
నాటి ఘటనలను గుర్తు చేసుకుంటే… ఇప్పుడు కూడా నిర్మలమ్మ సరిగ్గా ఎన్నికల ముందుగా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ప్రకటించినా… ఎన్నికలు ముగిశాక పుదుచ్చేరికి మొండిచెయ్యి చూపడం ఖాయమనే చెప్పాలి. అంటే… నాడు ఏపీకి మోదీ ఇచ్చిన అబద్దపు వాగ్దానం… ఇప్పుడు పుదుచ్చేరికి నిర్మలమ్మ చేస్తున్నారన్న మాట. మొత్తంగా అబద్దపు హామీలు ఇవ్వడంలో తనను మించిన వారెవ్వరూ లేరని మరోమారు బీజేపీ నిరూపించుకుందన్న మాట.