ఏపీలో అవినీతి, అక్రమాల పాలనను రాయల సీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. అవినీతి పరుల(వైసీపీ) చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. కడపజిల్లాలోని రాయచో టి నియోజకవర్గంలో `నిజం గెలవాలి` కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించు కోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. అనంతరం అక్కడే టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు.
“చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టింది. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు లేవు. పీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే… నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలి పారిపోతున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు, ప్రభుత్వం రాచి రంపాన పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ ప్రజలు పౌరుషంగా బయటకు రావాలి“ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
చెప్పేవే చేస్తారు.. ఆలోచించండి!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన `సూపర్ -6` పథకాలపై వైసీపీ చేస్తున్న దుష్ర్పరాన్ని నమ్మొద్దనినారా భువనేశ్వరి చెప్పారు. చెప్పేవన్నీ చేస్తారని తెలిపారు. “2024లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఆమాటకు కట్టుబడతారు“ అని నారా భువనేశ్వరి చెప్పారు.
మహిళలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అలుపెరుగని పోరాటం చేశారని భువనేశ్వరి తెలిపారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. అంతేకాదు.. నారా, నందమూరి కుటుంబాలకు సీమ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. “మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా తమ వంతుగా టీడీపీ విజయానికి కృషి చేయాలి” అని భువనేశ్వరి పిలుపు నిచ్చారు.