ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే పెన్షన్లను పెంచారు. తాజాగా సూపర్ సిక్స్‌లో ఒకటైన దీపం పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి మూడు చొప్పున ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీ మహిళలను ఖుషీ చేసే మరో గుడ్‌న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.
రాష్ట్ర మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్రీ బస్సు స్కీమ్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని.. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కూడా తమ ప్రభుత్వం కల్పిస్తుందని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆ దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఎన్నో పరిశ్రమలను కూటమి సర్కార్ తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ సందర్భంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ పై జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ కు.. తమ ప్రభుత్వంపై పోరాడే హక్కు లేదన్నారు. 2 రోజులు ఏపీ, 5 రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో సేద తీరే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుస్తుందని జనార్దన్ రెడ్డి చురకలు వేశారు. ప్రజల ఫుల్ సపోర్ట్ తమ ప్రభుత్మానికే ఉందన్నారు.