ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ఆయన చుట్టూ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బన్నీ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన బన్నీ.. మెగా ట్యాగ్ ను వదిలించుకుని సొంత అల్లు బ్రాండ్ ను గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ కి పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఈ మధ్య అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి `అల్లు అర్జున్ ఆర్మీ` అని కొత్త పేరు పెట్టుకున్నాడు.
ఆయన ఏ వేడుకకు హాజరైన అల్లు ఆర్మీ అనే పదం గట్టిగా వినపడుతోంది. పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లోనూ బన్నీ తన ఆర్మీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అదే ఇప్పుడు కొత్త తంటా తెచ్చిపెట్టింది. ఆర్మీ అన్న పదాన్ని బన్నీ వాడటం పట్ల గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో బన్నీపై శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు కూడా చేశారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, ఆర్మీ అంటే జాతీయ సమగ్రత మరియు దేశ భద్రతకు సంబంధించిన అంశమని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. అటువంటి పేరును అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి పెట్టుకోవడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. ఆర్మీ అనేది అభిమానులకు ఉపయోగించకూడదని.. ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడీ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.