తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టవడం, దాదాపు మూడువారాలైన బెయిల్ దొరకని పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు డీలాపడిపోయిన సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ సైకిల్ పార్టీ రథసారథికి బెయిల్ కోసం టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు తనయుడు, పార్టీ యువనేత లోకేష్ అయితే ఢిల్లీలో ఇదొక్కటే పనిగా పెట్టుకొని ఫాలో అప్ లో ఉన్నారు. అయితే , ఏపీ మాజీ ముఖ్యమంత్రికి నిరాశే ఎదురవుతోంది. తాజాగా 9వ తేదీకి కేసు వాయిదా పడింది. ఇలా కోర్టుల్లో ఉత్కంఠ నెలకొంటున్న సమయంలో … ఓ న్యాయస్థానంలో వెలువడిన తీర్పు… తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉపశమనంగా మారింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణకు బెయిల్ దొరికిన సందర్భం గురించే ఈ చర్చ.
వైసీపీ నేత, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పై విశాఖపట్టణంలోని నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 2న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బండారును మొబైల్ కోర్టులో హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రూ.25 వేల పూచీకత్తుతో బండారుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేసు పూర్వాపరాలు అలా ఉంచితే బండారుపై బెయిల్‌పై విడుదలవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద రిలీఫ్‌గా మారిందని అంటున్నారు. ఓవైపు ఇప్పటికే పార్టీ రథసారథి చంద్రబాబు జైలుపాలవడం, ఆయనకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ దొరక్కపోవడం ఇంకోవైపు యువనేత లోకేష్‌కు సైతం నోటీసులు ఇచ్చిన తరుణంలో… బండారు అరెస్టవడం తెలుగుదేశం శ్రేణులకు షాకిచ్చింది. అసలు పార్టీకి ఇదేం బ్యాడ్ టైం అనే కామెంట్లు కూడా కొందరు చేశారు. ఇలాంటి తరుణంలో… బండారు బెయిల్ దొరకడంతో ఊపిరి ఆడని సమయంలో వీచిన ప్రశాంతమైన గాలి లాంటి అనుభూతి వంటిదని టీడీపీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
ఇక బెయిల్‌పై విడుదలైన అనంతరం బండారు సత్యనారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని.. ధర్మం, న్యాయం గెలుస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసే సమయం నుంచి లోకేశ్ అండగా నిలిచారని తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటున్నా అని అన్నారు.